Begin typing your search above and press return to search.

త‌న మాట‌ల‌తో బాబుకు మ‌ళ్లీ షాకిచ్చిన జేసీ

By:  Tupaki Desk   |   26 Aug 2018 9:20 AM GMT
త‌న మాట‌ల‌తో బాబుకు మ‌ళ్లీ షాకిచ్చిన జేసీ
X
టీడీపీ ఎంపీ.. సీనియ‌ర్ రాజ‌కీయ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి త‌న మాట‌ల‌తో సంచ‌ల‌నం సృష్టించారు. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా.. కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లు మాట్లాడే అల‌వాటు ఉన్న జేసీ.. బాబు చేసే త‌ప్పుల్ని బాహాటంగానే చెప్ప‌టం క‌నిపిస్తుంది. తాజాగా క‌ర్నూలులోని ఎస్టీబీసీ మైదానంలో న‌మ్మ‌క‌ద్రోహం.. కుట్ర రాజ‌కీయాల‌పై ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ను నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఎంపీ జేసీ.. నిజాలు మాట్లాడేందుకే తాను అనంత‌పురం నుంచి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఈ దీక్ష‌లు వృధా అని చెప్ప‌టం ద్వారా బాబుతో స‌హా వేదిక మీద ఉన్న వారంద‌రికి షాకిచ్చారు. త‌న ప్ర‌సంగం ఆరంభంలోనే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ర‌ని తెలిసినా బాబుకు నిజాలు చెప్పాల‌నుకుంటున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఏపీలో మోడీకి ఓటు వేసే వారెవ‌రూ లేర‌న్నారు. అందుకే దీక్ష‌లు వృధా అని తేల్చి చెప్పారు. మ‌హాత్మాగాంధీ.. స‌ర్ అర్థ‌ర్ కాట‌న్ ను తెలుగు ప్ర‌జ‌లు ఎప్ప‌టికి మ‌ర్చిపోలేర‌ని.. అలానే చంద్ర‌బాబును కూడా ఎవ‌రూ మ‌ర‌వ‌ర‌ని చెప్పారు. బాబు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న న‌మ్మ‌కం లేద‌ని.. త‌న‌కు ప‌ద‌వుల‌కు ఆశ కూడా లేద‌న్నారు.

తాను రాజ‌కీయాల నుంచిరిటైర్ కానున్న‌ట్లు చెప్పారు. ఇదే విష‌యాన్ని గ‌తంలోనూ చెప్పాన‌ని.. ఇప్పుడు కూడా చెబుతున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ధ‌ర్మ పోరాట దీక్ష‌లు వృధా అని చెప్పిన ఆయ‌న‌.. మోడీ స‌ర్కారుకు మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకోవాల‌ని తాను మూడేళ్ల క్రిత‌మే బాబుకు చెబితే ఆయ‌న తొంద‌ర‌ప‌డొద్ద‌ని వారించార‌న్నారు.

చేతికి ఎముక లేకుండా సంక్షేమ ప‌థ‌కాలు చేప‌ట్ట‌టం బాగున్నా.. ప్రాజెక్టుల్ని చేప‌డితే త‌న లాంటి రైతులుఎప్ప‌టికి మ‌ర్చిపోలేర‌న్నారు. బాబుకు స‌ల‌హాలు ఇస్తూనే.. వేదిక మీద ఉన్న వారు బాబును త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని చెప్పారు. బాబును త‌ప్పుదారి ప‌ట్టిస్తున్న వారు వేదిక మీద ఉన్నార‌ని.. ఈ త‌ర‌హా దీక్ష‌లు.. వేదిక‌లు అవ‌స‌రం లేద‌ని చెప్ప‌టం ద్వారా జేసీ సంచ‌ల‌నం సృష్టించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.