Begin typing your search above and press return to search.

బాబును బుక్ చేసేందుకు..జేసీ ఒక్క‌డు చాలు!

By:  Tupaki Desk   |   6 Nov 2018 10:39 AM GMT
బాబును బుక్ చేసేందుకు..జేసీ ఒక్క‌డు చాలు!
X
తెలుగు దేశం పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు తీసుకునే నిర్ణ‌యాలు ఇటు వైరివ‌ర్గాల‌నే కాకుండా అటు సొంత పార్టీ కేడ‌ర్‌ ను కూడా అయోమ‌యానికి గురి చేస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అస‌లు ఏదైనా నిర్ణ‌యం తీసుకునే ముందు దానిపై త‌న‌కు తానుగా ఓ నిర్ణ‌యం తీసేసుకుని... ఆ త‌ర్వాత దానిని ఉమ్మ‌డిగానే తీసుకున్న నిర్ణ‌యంగా క‌ల‌రింగ్ ఇవ్వ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్న వైనం కూడా మ‌న‌కు కొత్తేమీ కాదు. అయితే ఆ నిర్ణ‌యాల వ‌ల్ల చంద్ర‌బాబుపై జ‌నంతో పాటుగా సొంత పార్టీ నేత‌ల నుంచే విసుర్లు ఎదుర‌వుతూ ఉంటాయి. ఇలా చంద్ర‌బాబు తాను తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా బ‌ద‌నాం కావ‌డానికి వేరే పార్టీ నేత‌లు ఏమాత్రం అక్క‌ర్లేకుండానే సొంత పార్టీలోనే ఇప్పుడు చాలా మంది నేత‌లు ఉన్నార‌న్న‌ది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట‌.

2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి... ఆ ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా టీడీపీలో చేరిపోయారు. ఆ వెంట‌నే అనంత‌పురం ఎంపీ టికెట్‌ ను తాను - తాడిప‌త్రి ఎమ్మెల్యే టికెట్ ను త‌న త‌మ్ముడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఇప్పించేసుకున్నారు. రెండు చోట్లా విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలో టీడీపీలో ఆయ‌న త‌న బ‌లాన్ని బాగానే చూపుకున్నాడ‌ని పార్టీ వ‌ర్గాల మాట‌. సీనియ‌ర్ నేత‌గా పార్టీలో త‌న‌కు ల‌భిస్తున్న ప్రాధాన్యాన్ని ఏమాత్రం వృథా పోనీయ‌కుండా చూసుకుంటున్న జేసీ... ఎప్ప‌టిక‌ప్పుడు బ‌హిరంగ వేదిక‌ల‌ పైనే చంద్ర‌బాబుకు దెబ్బ‌లేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అస‌లు త‌న స‌మ‌క్షంలోనే బ‌హిరంగ స‌భా వేదిక‌ల మీద జేసీ చేస్తున్న వ్యాఖ్య‌లు త‌న‌ను పొగ‌డుడుతున్నాయా? తఎగ‌డుతున్నాయా? అన్న విష‌యాన్ని కూడా తేల్చుకోలేక చంద్ర‌బాబు నానా యాత‌న ప‌డుతున్న వైనం కూడా మ‌న‌కు చిర‌ప‌ర‌చిత‌మే. త‌న ముందే - త‌న‌ను తెగ‌డుతూ వ్యాఖ్య‌లు చేస్తున్న జేసీని నిలువ‌రించ‌డం బాబుకు చేత కావ‌డం లేదు. అందుకేనేమో... ఓ వైపు త‌న‌ను జేసీ తెగ‌డుతున్నా చంద్ర‌బాబు మాత్రం తాను ఇబ్బంది ప‌డుతున్న వైనం బ‌య‌ట‌ప‌డ‌కుండా ముసిముసి న‌వ్వులు న‌వ్వుతూ క‌నిపిస్తున్న వైనం కూడా మ‌న‌కు కొత్తేమీ కాదు.

అయినా ఇప్పుడిదంతా ఎందుకంటారా? ఇప్పుడు కూడా జేసీ దివాక‌ర్ రెడ్డి... చంద్ర‌బాబును మ‌రోమారు బుక్ చేసి పారేశారు. అది కూడా తాను మొన్న‌టిదాకా కొన‌సాగిన కాంగ్రెస్‌ తో బాబు పొత్తు పెట్టుకున్న విష‌యంపై జేసీ... బాబును బుక్ చేసి పారేశారు. వాస్త‌వంగా అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా చంద్ర‌బాబు వ్యూహాలు న‌డుస్తుంటాయి. కేవ‌లం అధికారం మాత్ర‌మే ముఖ్యం... మ‌న వ్య‌క్తిత్వంపై జ‌నం ఏమ‌నుకున్నా ఫ‌ర‌వా లేద‌న్న కోణంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీడీపీని ఏ పార్టీ సిద్ధాంతాల‌కు వ్య‌తిరేకంగా అయితే ఏర్పాటు చేశారో... ఇప్పుడు అదే పార్టీతో చంద్ర‌బాబు అంట‌కాగేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ విష‌యంపై కాసేప‌టి క్రితం జేసీ త‌న‌దైన శైలిలో స్పందించారు.

కేవలం అధికారం కోస‌మే కాంగ్రెస్ తో చంద్ర‌బాబు పొత్తు పెట్టుకోవ‌డాన్ని జ‌నం హ‌ర్షించర‌ని ఆయ‌న‌ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అయితే కేవ‌లం ఈ ఒక్క అంశం కోస‌మే చంద్ర‌బాబు కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోలేద‌ని కూడా జేసీ త‌నదైన మార్కు పంచ్‌ ను వ‌దిలారు. దీనిపై జేసీ ఏమ‌న్నారంటే... *ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సహాయంతో తమ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే జనం హర్షించరు. కానీ ముఖ్యమంత్రి పదవి కోసమే రాహుల్ గాంధీతో చంద్రబాబు కలవలేదు* అని జేసీ వ్యాఖ్యానించారు. మొత్తంగా కాంగ్రెస్‌ తో చంద్ర‌బాబు దోస్తీ దేనికోస‌మ‌న్న కోణంలో ఇప్ప‌టికే పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, దీనిపై త‌న మ‌న‌సులోని మాట‌తో పాటు జ‌నం ఏమ‌నుకుంటున్నార‌న్న విష‌యాన్ని జేసీ నిర్భ‌యంగా ఎలాంటి త‌త్త‌ర‌పాటు లేకుండా కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్టుగా చెప్ప‌డం టీడీపీ వ‌ర్గాల‌కు షాకింగేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.