Begin typing your search above and press return to search.

అరెరే.. ఎలాంటి జేసీ ఎలా అయిపోయాడు..

By:  Tupaki Desk   |   6 Sept 2019 9:00 PM IST
అరెరే.. ఎలాంటి జేసీ ఎలా అయిపోయాడు..
X
జేసీ దివాకర్ రెడ్డిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే ఉండదు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి.. విభజన నేపథ్యంలో టీడీపీకి షిఫ్ట్ అయిన ఆయన.. బాబు హయాంలో ఎంతలా చెలరేగిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తన నోటి తీటతో బాబు సర్కారును పలు సందర్భాల్లో ఇరుకున పడేసిన ఆయన.. నాటి విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ కు తిరుగు లేదన్న మాట ఉంది. అలాంటి జేసీ.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు.. ఆసక్తికరంగా మారాయి. జేసీ లాంటి నేత పార్టీలోకి వస్తానంటే దండేసి.. దండం పెట్టి మరీ రమ్మనేవారని చెబుతారు. కాలం ఎప్పుడూ ఒకే తీరులో ఉండదు కదా. ఎలాంటి జేసీ మరెలా మారారన్న దానికి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

మేం పార్టీలోకి వస్తామంటే మమ్మల్ని రానిస్తారా? అన్న మాట జేసీ నోటి నుంచి వచ్చిందంటే.. పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల విషయంలో జగన్ చాలా కచ్ఛితంగా ఉన్నట్లుగా చెబుతారు. దీనికి బలం చేకూరేలా జేసీ మాటలు ఉన్నాయని చెప్పాలి. ఏపీలో టీడీపీ దారుణ పరిస్థితుల్లో ఉండటం.. సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం లేకపోవటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అయితే.. పార్టీ మారి వచ్చే నేతల విషయంలో జగన్ కచ్ఛితంగా ఉండటం.. విమర్శలకు అవకాశం లేకుండా వ్యవహరిస్తుండటం తెలిసిందే. జేసీకి ఉన్న నోటి దురద తెలిసిందే. అదే సమయంలో అనంతపురం జిల్లాలో ఆయనకున్న పట్టు ఏమిటన్న విషయం తాజాగా ఆయన రాజకీయ వారసుల్ని ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో తెలిసిందే. అలాంటప్పుడు జేసీ అండ్ కోను పార్టీలోకి తీసుకురావటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం నెలకొంది. ఈ కారణంతోనే.. ఆయన పార్టీలో వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ.. జగన్ పరివారం నుంచి సానుకూల సంకేతం లేదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు వేశారు జేసీ. అదే సమయంలో జగన్ ను చేయి పట్టి నడిపించే వారి అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. జగన్ కు ప్రతి అంశాన్ని మైక్రోస్కోప్ లో చూసి లోపాలు సరిదిద్దాలన్నారు. అంతేకానీ మైక్రోస్కోప్ ను నేలకేసి కొట్టొద్దన్న మాట ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జగన్ ను ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ.. మా వాడు చాలా తెలివైనవాడు అంటూ కితాబులు ఇచ్చారు జేసీ. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలన్ని విన్నప్పుడు.. ఎలాంటి జేసీ ఎలా అయ్యారన్న భావన కలగటం ఖాయం. పార్టీలోకి వస్తానంటే వద్దనకుండా ఉండే పరిస్థితి నుంచి మమ్మల్ని రానిస్తారా వరకూ చూస్తే.. ఇప్పుడేం జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు.