Begin typing your search above and press return to search.

టీడీపీలో చేరి జేసీ త‌ప్పుచేశార‌ట‌!

By:  Tupaki Desk   |   1 Sep 2017 11:42 AM GMT
టీడీపీలో చేరి జేసీ  త‌ప్పుచేశార‌ట‌!
X
అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌ రెడ్డి వెరైటీ కామెంట్ల‌కు పెట్టింది పేరు. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రిని ఎలా తిడ‌తాడో? ఎవ‌రిని ఎప్పుడు ఎలా పొగుడుతాడో? చెప్ప‌డం క‌ష్టం. తాజాగా జేసీ ఈ బాప‌తు కామెంట్లే చేసి.. టీడీపీని ఇరుకున పెట్టాడు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌ లో ఉన్న జేసీ... రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలో చేరి సంచ‌ల‌నం సృష్టించాడు. అయితే, అప్పుడు అలా తాను టీడీపీలో చేర‌డంపై ఇప్పుడు కామెంట్ చేస్తూ.. తాను చాలా త‌ప్పు చేశాన‌ని చెప్పుకొచ్చాడు.

ఇటీవ‌ల అనంత‌పురంలోని గుంత‌క‌ల్లులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన జేసీ.. టీడీపీపై వెరైటీ కామెంట్లు చేశారు. టీడీపీలో ఉన్న మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ప్రభాకర్‌ చౌదరితోపాటు అంతా సుదీర్ఘంగా ఆ పార్టీలో ఉన్న‌వారేన‌ని చెప్పుకొచ్చారు... అయితే తాను మాత్రం వలస పక్షినని జేసీ అన్నారు. తనకు కుల పిచ్చి(రెడ్డి) ఉందని - అయితే సీఎం చంద్రబాబుతోపాటు చాలా మంది టీడీపీ నేతలకు ఈ విషయం తెలియదని చెప్పారు. సీఎం తనకు కిరీటం ఏమీ పెట్టలేదని.. అయినా తనకు అలాంటివి అవసరం లేదని వ్యాఖ్యానించారు.

తాను టీడీపీలో చేరి త‌ప్పు చేశాన‌ని అన్నాడు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలోనూ జేసీ కామెంట్లు వెరైటీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు.. 2019లోగా పూర్తికాదని, మరోసారి చంద్రబాబును సీఎంను చేస్తే తప్ప అని పేర్కొన్నారు. టీడీపీ పాలన సరిగా లేదని కొందరు చెబుతున్నారని, అయితే చంద్ర‌బాబు పాలన బాగానే ఉందన్నారు. రాష్ట్రంలో ఇద్దరే నాయకులు ఉన్నారని.. వీరిలో ఒకరు చంద్రబాబు కాగా, మరొకరు ఏపీ ప్రతిపక్షనేత - వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అని చెప్పారు. మొత్తానికి జేసీ కామెంట్ల‌తో కార్య‌క్ర‌మం అంతా న‌వ్వుల్లో మునిగిపోయింది. ఏదేమైనా త‌న మార్కు స‌టైర్ల‌తో జేసీ అద‌ర‌గొట్టాడు.