Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుపై జేసీ సెటైర్‌!

By:  Tupaki Desk   |   24 Nov 2018 7:24 AM GMT
చంద్ర‌బాబుపై జేసీ సెటైర్‌!
X
అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి రూటే స‌ప‌రేటు. త‌న మ‌న‌సులో ఏం అనుకుంటే అది చెప్పేస్తారు. ఆ మాట‌లు ఎవ‌రికి త‌గులుతాయి? ఆ మాట‌ల‌తో పార్టీకి - అధినేత‌కు - త‌న‌కు ఏమైనా న‌ష్ట‌మా? అనే అసలే ఆలోచించ‌రు. అందుకే త‌ర‌చుగా ఆయ‌న వివాదాల్లో చిక్కుకోవ‌డ‌మూ క‌నిపిస్తుంటుంది. ఇలాంటి వ్యాఖ్య‌ల‌తోనే చంద్ర‌బాబుకు ఆయ‌న త‌ల‌నొప్పిగా మారార‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా మ‌రోసారి జేసీ ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ఏకంగా చంద్ర‌బాబునే టార్గెట్ చేసి వ్యంగ్యాస్త్రం సంధించారు. దీంతో టీడీపీ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. తాజాగా అనంత‌పురంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ప‌లు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా నేత‌ల‌తో స‌మావేశ‌మై సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు.

అనంత‌పురం టీడీపీలో గ్రూపు రాజ‌కీయాలు - కుటుంబ పాల‌న ప్ర‌ధానంగా ఈ భేటీల్లో చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చాయ‌ట‌. పార్టీ ప్రయోజనాల‌ను పట్టించుకోకుండా స్వలాభాల కోసం కొందరు నాయకులు పనిచేస్తున్న‌ట్లు ఫిర్యాదులు అందాయ‌ట‌. దీంతో చంద్ర‌బాబు తీవ్ర అస‌హ‌నం - ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. మంత్రులు - ఎమ్మెల్యేలు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు పెత్త‌నం క‌ట్ట‌బెట్ట‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించార‌ట‌. ఇక‌నైనా తీరు మార్చుకోవాల‌ని హెచ్చ‌రించార‌ట‌. ప్ర‌ధానంగా కుమారుడు ప‌రిటాల శ్రీ‌రామ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై మంత్రి సునీత‌ను ల‌క్ష్యంగా చేసుకొని ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు జారీ చేశార‌ట‌. వార‌స‌త్వం చూసి తాను టికెట్లు ఇవ్వ‌న‌ని - స‌ర్వేల ఆధారంగానే ఆ ప‌ని చేస్తాన‌ని స్ప‌ష్టం చేశార‌ట‌.

అయితే - చంద్ర‌బాబు మీటింగ్ అనంత‌రం జేసీ స్పందించిన తీరు ప్రస్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. త‌మ‌కు చెప్పిన సూత్రాలు - చేసిన సూచ‌న‌ల‌ను తొలుత‌ చంద్ర‌బాబు పాటించి చూపాల‌ని జేసీ సెటైర్ వేసిన‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న కుమారుడు లోకేష్‌ కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం - పార్టీలో పెద్ద‌పీట వేయ‌డం వంటి ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకొనే జేసీ ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడి ఉంటార‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. త‌న కుమారుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డిని ఈ ద‌ఫా అనంత‌పురం లోక్‌ స‌భ స్థానం నుంచి పోటీ చేయించాల‌ని జేసీ భావిస్తున్నార‌ని.. అందుకే చంద్ర‌బాబు మాట‌లు ఆయ‌నకు న‌చ్చ‌లేద‌ని వారు వివ‌రిస్తున్నారు. మ‌రి జేసీ సెటైర్‌ పై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!