Begin typing your search above and press return to search.

జేసీకి బాబుకు మధ్య మధ్యవర్తి ఎవరు..?

By:  Tupaki Desk   |   10 Aug 2015 4:29 AM GMT
జేసీకి బాబుకు మధ్య మధ్యవర్తి ఎవరు..?
X
అనంతపురం తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ లో సుదీర్ఘంగా సాగిన జేసీ దివాకర్ రెడ్డి.. విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే.

ఉన్నట్లుండి జేసీ కి సైకిల్ మీద అంత మోజు ఎందుకు పుట్టింది? ఆయన్ను పార్టీలో ఆహ్వానిస్తే.. పరిటాల ఫ్యామిలీతో వైరం అయ్యే వీలుందని.. ఇది పార్టీలో లేనిపోని కొత్త సమస్యలకు దారి తీస్తుందన్న వాదనలు వినిపించాయి. కానీ.. అలాంటివేమీ లేకుండా ఎవరికి వారుగా ఉంటున్న పరిస్థితి. ఇంతకీ టీడీపీ లోకి జేసీ ఎంట్రీ ఎలా ఇచ్చారు? వీరి మధ్య రాయబారం నడిపింది ఎవరన్న అంశంపై కొన్ని వాదనలు ఉన్నా.. జేసీ ఇప్పటివరకూ క్లారిటీ ఇచ్చింది లేదు.

తాజాగా మాత్రం తాను తెలుగుదేశం పార్టీ లోకి ఏ పరిస్థితుల్లో వచ్చాను? ఎవరి మధ్యవర్తిత్వం ద్వారా తాను పార్టీ లో చేరానో అన్న విషయాన్ని చెబుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ మధ్యవర్తిత్వం ద్వారా తాను టీడీపీ లోకి చేరినట్లుగా జేసీ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో.. లోకేశ్ మధ్యవర్తిత్వం వల్లే తాను టీడీపీ లోకి చేరినట్లుగా వెల్లడించారు.

భవిష్యత్తు లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని చెబుతున్న జేసీ.. రాష్ట్ర విభజన మొత్తం తన కుమారుడు రాహుల్ ను ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతోనే సోనియా ఇదంతా చేశారన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు రాజకీయ అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మొత్తానికి తాను టీడీపీ లో ఎలా చేరిన విషయాన్ని జేసీ చెప్పేయటమే కాదు.. ఏపీలో తమ పార్టీకి తప్ప మరొకరికి అవకాశం లేదన్నట్లుగా మాట్టాడటం చూస్తుంటే.. బాబుపై జేసీ చాలా కాన్ఫిడెంట్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.