Begin typing your search above and press return to search.

మోడీ పాజిటివ్.. జేసీ బీజేపీలోకేనా?

By:  Tupaki Desk   |   14 Sep 2019 7:18 AM GMT
మోడీ పాజిటివ్.. జేసీ బీజేపీలోకేనా?
X
రాయలసీమ రెడ్డప్పగా పేరుగాంచిన సీనియర్ నేత - మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపే ఆయన తాజాగా టీడీపీ లోంచి బీజేపీలోకి వెళ్లడానికి రెడీ అయినట్టు తెలిసింది. తాజాగా మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఇదే మోడీని హిట్లర్ తో పోల్చారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తాను హిట్లర్ ను చూడలేదని.. కానీ మోడీ వ్యవహారశైలి మాత్రం అదే రకంగా ఉందని మండిపడ్డారు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాలతో బీజేపీ హవా వీచి టీడీపీ కుదేలు అవ్వడంతో రెడ్డప్ప బీజేపీపై తనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు.

తాజాగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన తప్పులతో ఓడాడని.. మోడీ పథకాలే ఆయనను గెలిపించాయన్నారు.. అందుకే బీజేపీలోకి వలసలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని.. బీజేపీలోకి నేతలంతా మారడానికి మోడీషాల హవానే కారణమన్నారు. ఏపీలోనూ ఇప్పుడు వైసీపీకి ప్రత్యామ్మాయంగా టీడీపీ కంటే అందరూ బీజేపీ వైపే చూస్తున్నానని జేసీ తెలిపారు.

ఇక దేశంలో జమిలి ఎన్నికలు కనుక మోడీ తీసుకువస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమేనని జేసీ స్పష్టం చేశారు. జగన్ 100 రోజుల పాలనపై ఏడాది తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. టీడీపీ నేతగా ఉంటూ తాజాగా మోడీపై ప్రశంసలు కురిపించిన జేసీ వ్యవహారం చూశాక ఈయన బీజేపీలో చేరడం ఖాయమన్న చర్చ అనంతపురం జిల్లాలో సాగుతోంది.