Begin typing your search above and press return to search.

జగన్ మావాడే..చంద్రబాబు జైలుకే..జేసీ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   28 Oct 2019 6:27 AM GMT
జగన్ మావాడే..చంద్రబాబు జైలుకే..జేసీ హాట్ కామెంట్స్
X
ఏపీలో రాజకీయం ప్రస్తుతం ఎన్నికల వేడిని తలపిస్తుంది. ఎన్నికలు ముగిసి పట్టుమని ఆరునెలలు కూడా కాకమునుపే విమర్శలు - ప్రతి విమర్శలతో నేతలు హోరెత్తిస్తున్నారు. పాపం ఎన్ని విమర్శలు చేసిన.. ఎన్ని కామెంట్లు చేసిన ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండదు..ఎదో మేము కూడా రాజకీయాలలో ఉన్నాం అనిపించుకోవడానికి తప్ప మరో అంశం కనిపించడంలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనంతపురం రాజకీయాలు వేరు అని చెప్పాలి. ముఖ్యంగా ఆ జిల్లాలో జేసీ బ్రదర్స్ హవా బాగా నడిచింది. అలాగే ఏ విషయంలో వారు తమ అభిప్రాయాన్ని చెప్పడం లో వారి తరువాతే ఎవరైనా. ఏదైనా కూడా నిర్మొహమాటంగా చెప్పేస్తారు.

తాజాగా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారం చేప్పట్టినప్పటి నుండి చంద్రబాబు ని జైలుకి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ పెద్ద బాంబు పేల్చారు. అలాగే ఇందులో బిజెపి పాత్ర ఉందో లేదో తాను సరిగ్గా చెప్పలేనని - వైసిపి ప్రభుత్వ తీరు చూస్తే చంద్రబాబు ని టార్గెట్ చేసుకొని ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది అని తెలిపారు.

ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో - ఆయన కుటుంబ సభ్యులతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పిన జెసి దివాకర్ రెడ్డి - తన బస్సులకు పర్మిట్లు రద్దు చేసినప్పటికీ జగన్ మా వాడే అంటూ చెప్పుకొచ్చారు. సీఎంగా జగన్ కి 100కు 150 మార్కులు వేశానని చెప్పారు. అలాగే ఏం బాబూ ఎప్పుడు లోపలికి వెళ్లేది అని చంద్రబాబును అడిగాను అని - ఇక దానికి సమాధానంగా చంద్రబాబు నేను లోపలికి పోను దివాకర్ రెడ్డీ - వీళ్లు నన్నేమీ చేయలేరు అని చెప్పారు అని తెలిపారు.

అప్పట్లో అమాయకుడైన జగన్ ను చంద్రబాబు - సోనియా అందరూ కలిసి జైల్లో వేశారని - జగన్ పై నమోదైన కేసుల విషయంలో చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ వాళ్లు అనుకుంటుంటారని - వైసీపీ వారు అనుకునే దాంట్లో ఎంత నిజం ఉందొ తనకి తెలియదు అని తెలియజేసారు. చంద్రబాబు విషయంలో జగన్ కు కోపమో - తాపమో ఉండడం సహజమేనని - అతని ఆవేశాన్ని తాను తప్పుబట్టడం లేదు అని - ఎక్కడైనా జగన్ కనిపిస్తే మాట్లాడతా అంటూ చెప్పారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విషయంలో సానుకూలంగా మాట్లాడుతున్న జెసి దివాకర్ రెడ్డి ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.