Begin typing your search above and press return to search.

చంద్రబాబును నిలదీసిన జేసీ దివాకర్ రెడ్డి

By:  Tupaki Desk   |   28 April 2016 7:50 AM GMT
చంద్రబాబును నిలదీసిన జేసీ దివాకర్ రెడ్డి
X
టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి తెగ ఇబ్బంది పెట్టేశారు. తన ప్రశ్నలతో చంద్రబాబును నిలదీసి ఆయన్ను సమాధానం చెప్పలేకుండా చేశారు. అలా అని ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా గళమెత్తారని అనుకోవద్దు. చంద్రబాబు పడుతున్న కష్టం చూడలేక... ఆయన ఇంటికి కూడా సమయం కేటాయించకుండా, మొన్ననే మొదటి పుట్టిన రోజు జరుపుకొన్న మనవడితో నిమిషం కూడా ఆడుకోకుండా రాత్రీపగలు రాష్ట్రం కోసమే కష్టపడుతున్న చంద్రబాబు లైట్ గా క్లాస్ పీకారు జేసీ. వయసులో చంద్రబాబు కంటే పెద్దవాడైన జేసీ ముఖ్యమంత్రితో కాస్త చనువుగానే మాట్లాడుతారు. ఆ క్రమంలోనే ఆయన గురువారం చంద్రబాబును ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు.

కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చేరిక సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలనలో నిమగ్నమైన చంద్రబాబు... తన మనవడితో కూడా సరదాగా గడపలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసుకుపోతున్న చంద్రబాబు కర్మయోగిలా మారారని కూడా జేసీ అన్నారు.

‘‘నా మనసులోని మాట చెబుతున్నా. దానిని మీరు పొగడ్త అనుకుంటే నేనేమీ చేయలేను.... భార్య - కొడుకు - కూతురు కంటే... మనవడు - మనవరాలితో గడిపే క్షణాలు ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రత్యేకమైనవే.. చంద్రబాబు అదంతా మిస్సవుతున్నారు. ఆయన పూర్తిగా కర్మయోగిలా మారిపోతున్నారు’’ అన్నారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు వైపు తిరిగి చూస్తూ.... అసలు మీ మనవడితో ఎంతసేపు ఆడుకున్నారో చెప్పండి అంటూ చంద్రబాబును నిలదీశారు. జేసీ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని చంద్రబాబు జనం వైపు చూస్తూ... సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు.