Begin typing your search above and press return to search.

అనంత టీడీపీలో ట్రయాంగిల్ వార్

By:  Tupaki Desk   |   25 Feb 2019 4:45 PM GMT
అనంత టీడీపీలో ట్రయాంగిల్ వార్
X
అనంతపురం టీడీపీ అంటేనే విభేదాలు - కొట్లాటలు. అందులోనూ జేసీ దివాకరరెడ్డి వంటి నేతల సంగతి చెప్పనవసరం లేదు. అనంతపురం ఎంపీ దివాకరరెడ్డి - ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ చౌదరి - మేయర్ స్వరూప ముగ్గురూ మూడు వర్గాలు. ఒకరంటే ఒకరికి గిట్టదు. తాజాగా ఎమ్మెల్యే - మేయర్‌ లకు ఎంపీ దివాకరరెడ్డి భారీ షాకిచ్చారు.

అనంతపురంలో రైల్వే పై వంతన ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు చంద్రబాబు వరకు చేరినట్లు తెలిసింది. రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే - మేయర్‌ కలెక్టర్ కోసం వేచి చూస్తుండగానే - ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కారు దిగి నేరుగా వెళ్లి వంతెన ప్రారంభించారు. దాంతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి - మేయర్ స్వరూపాలు కంగుతిన్నారు.

అనంతపురం నగరంలోని పాతూరులో రహదారుల విస్తరణ విషయంలో ఎంపీ దివాకర్ రెడ్డి - ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య రేగిన వివాదం - చినికి - చినికి గాలివానలా మారి వర్గవిభేదాల వరకు దారితీసింది. ఇది అంతటితో ఆగకుండా ఇరు వర్గాలు తమ బలనిరూపణకు దిగేవరకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని ఇరువురిని కూర్చోబెట్టి గట్టిగా హెచ్చరించి పంపించారు. అమరావతి నుంచి తిరిగొచ్చిన ఇద్దరు నేత లు పాతూరు రోడ్ల విస్తరణ వివాదం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగానే ఎంపీ దివాకర్ రెడ్డి నగరంలోని రామనగర్ కాలనీకి వెళ్లే దారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించారు. దీని నిర్మాణానికి గుత్తేదారు ఎంపిక విషయం నుంచి ఎమ్మెల్యే - ఎంపీల మధ్య వివాదం ఉంది. వీరి వివాదం కొనసాగుతుండగానే ఆ వంతెనకు పేరు పెట్టే విషయంలో ఎమ్మెల్యేకు - నగర మేయర్ స్వరూపకు వివాదం నెలకొంది. వంతెనకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎమ్మెల్యే ప్రభాకర్ నిర్ణయించగా - దీన్ని విభేధించిన మేయర్ స్వరూప సీఎం చంద్రబాబు పేరు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉండగానే... సోమవారం ఉదయం రామనగర్ పై వంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి ముగ్గురి నేతలకు ఆహ్వానం వెళ్లడంతో ప్రభాకర్ చౌదరి అరగంట ముందుగానే ఫ్లైఓవర్‌ వద్ద గల సభాస్థలికి చేరుకున్నారు. మేయర్ స్వరూప కూడా పావుగంట ముందుగానే వచ్చారు. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా కూర్చుండగా.. ఎంపీ జేసీ కారులో అక్కడికి చేరుకున్నారు. వంతెన ప్రారంభానికి కలెక్టర్ వస్తున్నారని అధికారులు ఎంపీకి చెప్పారు. ఎవరి కోసమో ఎదురు చూడటం ఏంటి.. వచ్చిన పుడు వస్తారులే'' అంటూ ఎంపీ నేరుగా వెళ్లి ఫ్లైఓవర్ ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే - మేయర్‌ లు షాకైపోయారు. ఎమ్మెల్యే అయితే తనకు అగౌరవం జరిగిందని ఆరోపించారు.