Begin typing your search above and press return to search.

నాకు తెలుసు, మోడీ హోదా ఇవ్వ‌డు - టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   9 April 2018 3:55 PM GMT
నాకు తెలుసు, మోడీ హోదా ఇవ్వ‌డు - టీడీపీ ఎంపీ
X
అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. టీడీపీకి హోదా మీద న‌మ్మ‌క‌మూ లేదు, ఆశా లేదు. వారెపుడో నీళ్లు వ‌దిలేసుకున్నారు. తెలుగుదేశం పోరాటం ఒక రాజ‌కీయ డ్రామా త‌ప్ప మ‌రేం కాదు, అని ప‌దే ప‌దే జ‌గ‌న్ చెబుతుంటే కాద‌న్న వారిని తెలుగుదేశం నేత - ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డే ఈరోజు నోళ్లు మూయించారు. హోదా వ‌చ్చే ప్ర‌స‌క్తే లేదు అని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఈరోజు జేసీ దివాక‌ర్‌రెడ్డి ఒక మీడియా ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న అన్న‌ది వింటే తెలుగు ప్ర‌జ‌ల క‌డుపు మండిపోతుంది. *మోడీ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా వ‌చ్చే స‌మ‌స్యే లేదు. మోడీ గురించి నాకు బాగా తెలుసు. ఏపీ గురించి ఆయ‌న ఏమ‌నుకుంటున్న‌దీ నాకు తెలుసు. మ‌నం హోదా కోసం చేసిన పోరాటాల‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరే అని వ్యాఖ్యానించారు. మోడీ చాలా మొండి ఘ‌టం. ఆయన ఏపీకి హోదా ఇవ్వ‌రు...* అని జేసీ వ్యాఖ్యానించారు.

మ‌రి మీరు ధ‌ర్నాలు చేస్తున్న‌ది నిజం కాదా అంటే.. #నాకు తెలిసినా చంద్ర‌బాబు ఆదేశిస్తున్నారు కాబ‌ట్టి, మా అధ్య‌క్షుడి కోసం నేను ధ‌ర్నాల్లో పాల్గొంటున్నాను. ఆయ‌న మాట కాద‌న‌లేం కదా! నాకు తెలిసినంత వ‌ర‌కు ఏపీకి హోదాకు బ‌దులుగా స‌మాన మైన నిధులు ఇస్తే తీసుకోవ‌డం మంచిది# అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మంచి నిధులిస్తే ఏపీ ప్ర‌జ‌ల‌ను ఒప్పించే బాధ్య‌త తీసుకుంటా అని కూడా అన్నారు.

జేసీ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఏపీలో సంచ‌ల‌నం అయ్యాయి. చాలామంది ఆయ‌న మీద మండిప‌డుతున్నారు. ఇది మ‌రీ బాగుంది. తెలంగాణ ఇస్తామ‌ని ఏపార్టీ చెప్పింది? ఇవ్వం అని ఖ‌రాఖండిగా చెప్పిన త‌ర్వాత కూడా ఉద్య‌మం తీవ్ర‌స్థాయికి తీసుకెళ్తే కేంద్రం దిగొచ్చింది. ఏపీ అడుగుతున్న‌ది మోడీ ఆస్తిని కాదు, భార‌తీయులుగా త‌మ హ‌క్కును అడుగుతున్నారు. దానిని నెర‌వేర్చ‌క‌పోవ‌డానికి మోడీ ఎవ‌రు అని సోష‌ల్ మీడియాలో జ‌నం జేసీ మీద ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ప్ర‌జ‌ల మాట పాల‌కులు వినాలి కాని... పాల‌కులు మాట ప్ర‌జ‌లు విన్న చ‌రిత్ర లేదు. ఇప్ప‌టికే హిట్ల‌ర్ వంటి పెద్ద నియంత‌లే నేల‌కొరిగి ప్ర‌జ‌లు గెలిచారు. మోడీ ఎంత అని వైసీపీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీకి చేత‌కాక‌పోతే పోరాటం నుంచి త‌ప్పుకోవాలి కాని.. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను, ఆశ‌ను నీరుకార్చొద్దు అంటే జేసీని తిట్టిపోస్తున్నారు. మ‌రి జేసీ త‌న మాట మీదే ఉంటాడా? చ‌ంద్ర‌బాబు జేసీ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తారా? స‌మ‌ర్థిస్తారా? చూడాలి.