Begin typing your search above and press return to search.

అనంత‌పురంలో దాదాగిరి పెరిగింది:జేసీ

By:  Tupaki Desk   |   5 Sep 2018 2:53 PM GMT
అనంత‌పురంలో దాదాగిరి పెరిగింది:జేసీ
X
కొద్ది రోజుల క్రితం పార్ల‌మెంటులో టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి `రాజీ` నామా ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. అనంత‌పురంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ ప‌నుల విష‌యంలో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకరచౌదరితో జేసీకి విభేదాలు వ‌చ్చాయ‌ని, దాంతో జేసీ రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకున్న చంద్ర‌బాబు....ప్ర‌భాక‌ర్ తో భేటీ అయి జేసీ రాజీనామాను ఆపారు. హుటాహుటిన రహదారుల విస్తరణకు రూ. 45 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. చంద్ర‌బాబు జోక్యంతో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది.అయితే, తాజాగా మరోసారి ప్ర‌భాక‌ర్ చౌద‌రిపై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం అభివృద్ధిని ప్ర‌భాక‌ర్ అడ్డుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌భాక‌ర్ వల్ల తాను అనంతపురంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించలేకపోయాయని, రోడ్లు విస్తరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంత‌పురంలో దాదాగిరి, ధందాగిరి పెరిగిపోతున్నాయ‌ని జేసీ అన్నారు. పోలీసులు, అధికారుల తీరుపై మండిప‌డ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో నేరస్తులకు దండంపెట్టి ఎదుట కూర్చోబెట్టుకుంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంతగా అనంత‌పురంలోని పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని జేసీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకోవ‌డం లేద‌న్నారు. ప్ర‌భుత్వ ఆస్తులు అక్ర‌మార్కుల చేతికి వెళుతున్నాయ‌ని, తాను జిల్లా కలెక్టర్, జేసీలకు స్వయంగా ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేద‌న్నారు. ఏదో సోది చెప్పి...పేజీల‌కు పేజీలు నివేదిక‌లిచ్చార‌ని ఎద్దేవా చేశారు. త్వ‌ర‌లోనే ఆ అధికారుల చిట్టాను ఆధారాలతో సహా సీఎం చంద్ర‌బాబు ముందుంచుతానని చెప్పారు. కొంత‌మంది చేస్తోన్న ప‌నుల వ‌ల్ల చంద్ర‌బాబుకు, ఆయ‌న ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని జేసీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనంతపురంలో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా మీడియా ప్రతినిధులు కళ్లుమూసుకొని కూర్చున్నారంటూ మీడియాపై కూడా జేసీ మండిపడ్డారు.