Begin typing your search above and press return to search.

పాత చంద్రబాబును పైకితెచ్చిన జేసీ

By:  Tupaki Desk   |   6 Jan 2016 8:14 AM GMT
పాత చంద్రబాబును పైకితెచ్చిన జేసీ
X
అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులోని పాత మనిషిని బయటకు తెచ్చినట్లయింది. రెండో విడత అధికారంలోకి వచ్చిన ఆయన ఇంతకాలం అధికారులను కొత్త అల్లుళ్లలా చూసుకున్నారు కానీ కొద్దిరోజులుగా మాత్రం అధికారుల పని పడుతున్నారు. పని చేయని అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాత చంద్రబాబు మళ్లీ బయటకు వచ్చారంటూ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అయితే.... ఆయనలా మారడానికి అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డే కారణమంటూ ఆయన్ను తిట్టుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి... చంద్రబాబు మెతక వైఖరి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడుతుంటే అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాత చంద్రబాబు బయటకు రాకపోతే అధికారుల కారణంగా ఆయన దెబ్బతినడం ఖాయమని కూడా అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించేవారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారుల విషయంలో కాస్త మెతక వైఖరితో ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు నాటి చంద్రబాబు కనిపించడం లేదని జెసి కూడా అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యల ప్రభావం చంద్రబాబుపై పడినట్లుగానే కనిపిస్తోంది. ఇటీవల ఆయన తరచూ అధికారులను గట్టిగా వార్నింగ్ ఇస్త్తున్నారు.

ఇటీవల విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా సరైన లెక్కలు తీసుకురాని రెవెన్యూ అధికారిని చంద్రబాబు నిలదీశారు. పని చేయకుంటే, ప్రమోషన్లు రావని వేదికపై నుంచి హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా నిన్న కృష్టా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు యువ ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్టా జిల్లా జాయింట్ కలెక్టర్‌ ను పేరు పెట్టి పిలిచి మరీ, పని చేయకుంటే వదిలేది లేదన్నారు. ప్రధానంగా ఆయన రెవెన్యూ అధికారుల తీరుపై సీరియస్ గా ఉన్నారు. దీంతో అధికారులంతా జేసీ ఆయన్ను హిప్నటైజ్ చేసేశారని.. లేదంటే మొన్నమొన్నటి వరకు చంద్రబాబు బాగానే ఉన్నారని అంటూ జేసీని తిట్టుకుంటున్నారు.