Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మీద భ‌య‌మా? ఆర్నెల్లో క్లారిటీ ఇస్తాన‌న్న జేసీ!

By:  Tupaki Desk   |   17 Jun 2019 8:54 AM GMT
జ‌గ‌న్ మీద భ‌య‌మా?  ఆర్నెల్లో క్లారిటీ ఇస్తాన‌న్న జేసీ!
X
మ‌న‌సుకు తోచిన విష‌యాన్ని మొహ‌మాటం లేకుండా చెప్పేసే అతి కొద్దిమంది రాజ‌కీయ నాయ‌కుల్లో జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక‌రు. విష‌యం ఏదైనా స‌రే సూటిగా చెప్పేస్తుంటారు. తాజాగా ప‌లు అంశాల మీద కుండ బ‌ద్ధ‌లు కొట్టేశారు. బీజేపీ నుంచి త‌న‌కు ఆహ్వానం వ‌చ్చింద‌ని చెప్పిన జేసీ.. ఆ అంశంపై తాను ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. త‌ద్వారా తాను పార్టీ మారే అంశంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌ని చెప్పాలి.

మ‌రోవైపు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అంటే త‌న‌కు భ‌యం లేద‌ని చెప్పారు. అలా చెబుతూనే.. ఆయ‌న‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌టంతో పాటు.. కాస్త పొగిడేశారు కూడా. నీతి ఆయోగ్ స‌మావేశంలో జ‌గ‌న్ చాలా హుందాగా వ్య‌వ‌హ‌రించార‌న్నారు. పులివెందుల నుంచి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఇలా ఉంటాడ‌ని తాను అనుకోలేద‌న్నారు. చూస్తుంటే.. జ‌గ‌న్ తీరు జేసీని అంక‌తంత‌కూ ఆక‌ట్టుకుంటోంద‌న్న సంకేతాల్ని త‌న మాట‌ల‌తో చెప్పార‌నుకోవాలి.

ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ కు తాను భ‌య‌ప‌డి పొగ‌డ‌టం లేద‌ని.. కావాలంటే జ‌గ‌న్ కు తాను భ‌య‌ప‌డుతున్నానో లేదో ఆర్నెల్ల త‌ర్వాత చూస్తే అర్థ‌మ‌వుతుందంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇంత‌కీ రానున్న ఆర్నెల్ల‌లో జేసీ ఏం చేయ‌నున్నారు? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఏపీ అసెంబ్లీ.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి నేప‌థ్యంలో అలాంటి ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డింద‌న్న అంశాల‌పై స‌మీక్షించుకోనున్న‌ట్లుగా జేసీ వెల్ల‌డించారు. చూస్తుంటే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ట్లుగా చెబుతున్న జేసీ.. రానున్న కొద్దిరోజుల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.