Begin typing your search above and press return to search.

జేసీ... ఈ పొంత‌న లేని మాట‌లెందుకండీ?

By:  Tupaki Desk   |   16 April 2018 11:24 AM GMT
జేసీ... ఈ పొంత‌న లేని మాట‌లెందుకండీ?
X
జేసీ దివాక‌ర్ రెడ్డి... ఏమాత్రం ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరే. గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందు వ‌ర‌కూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో కొన‌సాగిన ఈ సీనియ‌ర్ నేత‌... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ కు గుడ్ బై కొట్టేసి టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. ఎన్నిక‌ల్లో అనంత‌పురం టికెట్ ను చేజిక్కించుకున్న జేసీ... అదే జిల్లాలోని తాడిప‌త్రి అసెంబ్లీ టికెట్ ను త‌న త‌మ్ముడు జేసీ ప్ర‌భాకర్ రెడ్డికి ఇప్పించుకోగ‌లిగారు. రెండో చోట్లా విజ‌యం సాధించిన జేసీ బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు జిల్లాలో బ‌ల‌మైన నేత‌లుగా ఎదిగార‌నే చెప్పాలి. ఈ బ‌లం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంద‌ర్భంగా బాగానే ప‌నిచేసింది గానీ... టీడీపీలో ఈ బ‌లం పెద్దగా అక్క‌ర‌కు వ‌స్తున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. ఇందుకు నిద‌ర్శ‌నంగానే... అనంత‌పురం పట్ట‌ణంలో ఓ ఎంపీగా జేసీ దివాక‌ర్ రెడ్డి తాను అనుకున్న‌ట్లుగా రోడ్ల విస్త‌ర‌ణ‌ను చేప‌ట్ట‌లేక‌పోయార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

స‌రే... బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేకున్నా... ఎంతైనా అధికార పార్టీ ఎంపీగా... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది క‌దా. దానిని కూడా ఆయ‌న కాపాడుకోలేక‌పోతున్నార‌న్న వాద‌న ఇప్పుడు కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చేసిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. నిత్యం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీద విరుచుకుప‌డే జేసీ... తాజాగా నేటి ఉద‌యం అమ‌రావ‌తి వేదిక‌గా జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి హాజ‌రైన సంద‌ర్భంగా త‌న‌దైన ఓ కొత్త వాద‌న‌ను వినిపించారు. టీడీపీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు త్వ‌ర‌లోనే వైసీపీలో చేరబోతున్నార‌ని స్వ‌యంగా వెల్ల‌డించిన జేసీ... అయినా అధికార పార్టీని వీడి వైసీపీలో ఎవ‌రు చేరుతారంటూ ఆ వెంట‌నే దానికి విరుద్ధ వ్యాఖ్య చేశారు. ఈ సంద‌ర్భంగా జేసీ ఏమ‌న్నారంటే... ప్రస్తుతం రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కొన‌సాగుతున్న వైసీపీ - జ‌న‌సేనల మ‌ధ్య పొత్తు కుదిర్చేందుకు ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్ర‌యత్నాలు సాగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇది కార్య‌రూపం దాల్చిన మ‌రుక్ష‌ణ‌మే కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరిపోతార‌ని ఆయ‌న చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లు విన్నంత‌నే మీడియా ప్ర‌తినిధులు నిజ‌మా అన్న‌ట్టుగా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌గా... ఏదో పొర‌పాటు దొర్లింద‌న్న‌ట్టుగా త‌న‌ను తాను స‌ర్దుకున్న జేసీ.. అయినా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు విప‌క్షంలో చేర‌తారంటే న‌మ్మెదెట్టాగ‌న్న‌ట్లుగా కొత్త వాద‌న వినిపించారు. అంతేకాకుండా ఢిల్లీ స్థాయిలో జ‌గ‌న్‌ - ప‌వ‌న్‌ ల‌ను క‌లిపేందుకు పెద్ద ఎత్తున య‌త్నాలు జ‌రుగుతున్నా... అది సాకార‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేద‌ని కూడా జేసీ అన్నారు. ఎందుకంటే .. జ‌గ‌న్ తో పాటు ప‌ద‌వుల‌పై ఆశ‌లు లేవ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా సీఎం కావాల‌ని కోరుకుంటున్నార‌ని - ఈ కార‌ణంగానే ఢిల్లీ య‌త్నాలు ఫ‌లించ‌బోవ‌ని జేసీ వ్యాఖ్యానించారు. మొత్తంగా ముందుగా చెప్పిన విష‌యానికి ఆ త‌ర్వాత క్ష‌ణాల వ్వ‌వ‌ధిలో వినిపించిన వాద‌న‌కు పొంత‌నే లేకుండా జేసీ చెప్పిన తీరు నిజంగానే మీడియా ప్ర‌తినిధుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.