Begin typing your search above and press return to search.

ఏ విధంగా చూసినా పోలీసులే టార్గెట్ అవుతున్నారా ?

By:  Tupaki Desk   |   12 Oct 2020 7:15 AM GMT
ఏ విధంగా చూసినా పోలీసులే టార్గెట్ అవుతున్నారా ?
X
కొన్ని ఉద్యోగాలంతే ఎంత చేసినా చివరకు తిట్లు, శాపనార్ధాలు తప్పవు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధ పరిస్ధితి ఇపుడిలాగే తయారైపోయింది. ఇదేదో ఇప్పటికిప్పుడు ఇలా అయిపోయింది కాదు. దశాబ్దాల తరబడి ఇదే పరిస్ది. అధికారంలో ఉన్న వాళ్ళతో చివాట్లు తిన్నారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ ప్రతిపక్షం నేతలతో కూడా చివాట్లు తింటున్నారంటేనే పోలీసులను చూస్తుంటే పాపం అనిపిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా వ్యవహారం చూస్తే ఈ విషయం వాస్తవమే అనిపిస్తుంది.

రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా కేంద్రంలోని గనులు, భూగర్భ శాఖ కార్యాలయానికి మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి వెళ్ళారు. మాజీ ఎంపి వెళ్ళే సమయానికి కార్యాలయంలో సిబ్బదిలో చాలామంది లేరు. తాను వస్తున్న విషయం తెలుసుకుని ముందే పారిపోయరంటూ జేసీ మండిపోయారు. ఇంతకీ అసలు కార్యాలయానికి జేసీ ఎందుకెళ్ళారు ? ఎందుకంటే తమ మైనింగ్ కార్యాలయం, గనులపై అధికారులు దాడులు చేశారట. ఈ విషయాన్నే కనుక్కుందామని జేసీ మైనింగ్ ఆఫీసుకు వెళ్ళారు.

తాను వెళ్ళే సమయానికి అక్కడ ఎవరు లేకపోవటంతో మండిపోయిన జేసి అక్కడే కూర్చున్నారు. ఎప్పుడైతే జేసీ కార్యాలయం మెట్ల మీదే కూర్చున్నానో వెంటనే పోలీసు అధికారులు వచ్చి నిలబడ్డారు. ఇంకేముంది సీఐని చూడగానే జేసీ నోటికి పనిచెప్పారు. ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. అవతల తిడుతున్నది జేసీ కాబట్టి సీఐ కూడా ఏమీ ఎదురు చెప్పలేక మౌనంగా భవించారు. చాలా సేపు జేసీ తిడుతునే ఉన్నారు, సీఐ తలొంచుకుని భరిస్తునే ఉన్నారు. ఇదంతా చూసిన వాళ్ళకు సిఐ మీద అయ్యో పాపం అనిపించింది.

తాజా విషయాన్ని పక్కనపెట్టేస్తే గడచిన ఏడాదిన్నరలో జేసీ సోదరులు పోలీసు అధికారులపై చాలా సార్లు నోరుపారేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కడప జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తాడిపత్రి దగ్గరకు వచ్చేటప్పటికి ర్యాలీని నియంత్రించేందుకు ప్రయత్నించిన డీఎస్పీపైన ఈమధ్య దివాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు తిట్టిన విషయం తెలిసిందే. ఈ కారణంతోనే బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రభాకర్ రెడ్డిపై వెంటనే పోలీసులు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళీ జైలుకు పంపారు. కేసు పెట్టించుకోవటం ఇప్పుడు దివాకర్ రెడ్డి వంతయ్యింది.

తిడుతున్నపుడు భరించిందంతా భరించిన సీఐ తర్వాత తీరిగ్గా తనను తిట్టినందుకు మాజీ ఎంపిపై పోలీసు స్టేషన్ కు వెళ్ళి సీఐ ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదైంది. అంటే జేసీ సోదరులు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పోలీసులనే టార్గెట్ చేస్తున్నట్లున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు తిట్టారంటే ఏదోలా భరిస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా తమనే తిడుతున్నారంటేనే పోలీసు ఉద్యోగమంటే థ్యాంక్ లెస్ జాబ్ అని అర్ధమైపోతోంది.