Begin typing your search above and press return to search.

చంద్రబాబు పని అయిపోయిందా... !?

By:  Tupaki Desk   |   19 July 2018 3:53 PM GMT
చంద్రబాబు పని అయిపోయిందా... !?
X
" దేశంలోనే అందరి కంటే సీనియర్ నాయకుడిని నేను" అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పని అయిపోయిందా...? వటుడింతై అని ఎదిగిన ఆయన నేడు ఎవరినీ శాసించలేని స్థితిలోకి వెళ్లిపోయారా... ? అవుననే అంటున్నాయి జరిగిన పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల నుంచి అధికారాన్ని వెలగబెడుతున్న అత్యంత సీనియర్ నాయకుడు కేవలం ఒక్క ఎంపీకి చులకన అయిపోయారు. " నేను ఎవరి మాట వినను. అందరూ నా మాటే వినాలి " అనే ధోరణిలో ఇన్నాళ్లూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తానే సర్వం సహా చక్రవర్తిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడ్ని ఇప్పుడు అందరూ బెదిరించే పరిస్థితి వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి తాజా ఉదాహరణ అనంతపురం లోక్‌సభ సభ్యుడు జే.సీ.దివాకర్ రెడ్డి ఉదంతం. జిల్లాలో తన మాటకు ఎదురులేదని, తమ కుటుంబమే కింగ్ అని వ్యవహరించిన జే.సీ.దివాకర్ రెడ్డికి ఎమ్మెల్యే సుధాకర్ చౌదరి గత కొంతకాలంగా చుక్కలు చూపిస్తున్నారు. సమయం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న దివాకర్ రెడ్డి కీలెరిగి వాత పెట్టారు.

అనంతపురం పట్టణంలో రహదారి విస్తరణ పనులకు అడ్డంకి ఎమ్మెల్యే ప్రభాకర చౌదరే కారణమని దివాకర్ రెడ్డి అనుకుంటున్నారు. రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్న కొన్ని ప్రార్ధనా మందిరాలను కూల్చాలని నిర్ణయించారు. అయితే ఆ ప్రార్ధనా మందిరాలకు చెందిన వారితో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కోర్టులో కేసు వేయించారి దివాకర్ అంటున్నారు. దీంతో తనకు వ్యతిరేకంగా జిల్లాలో మరో వర్గాన్ని ప్రోత్సహిస్తారన్నది ఆయన అభియోగం. ఇన్నాళ్లూ సమయం కోసం ఎదురు చూసిన దివాకర్ రెడ్డి సరిగ్గా సమయం చూసి సిఎం చంద్రబాబును - ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఇరుకున పెట్టారు. దీనికి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టే వాడుకున్నారు. తాను అలిగినట్లుగా - దీనికి సుజనా చౌదరే కారణమని పైకి చెప్పి లోపల మాత్రం అసలు కారణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసేలా చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన తమ పార్టీకి చెందిన సభ్యుడే సభకు రాకపోతే ఢిల్లీలో పరువు పోతుందనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో సమావేశం ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు.

దివాకర్ రెడ్డి దెబ్బతో దిగివచ్చిన చంద్రబాబు నాయుడు అనంతపురంలో రోడ్ల విస్తరణకు 45 కోట్లు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. అంతే కాదు ఈ విషయాన్ని అధికారుల ద్వారా ఎంపీ జే.సీ.దివాకర్ రెడ్డికి తెలియజేశారు. తాను అనుకున్నది సాధించుకున్నారు కనుక దివాకర్ రెడ్డి శుక్రవారం ఉదయం బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లి లోక్‌ సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తానికి సరైన సమయంలో ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టిన జే.సీ.దివాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఈ ఒక్క సంఘటనే చంద్రబాబు నాయకత్వం బలహీన పడింది అనడానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.