Begin typing your search above and press return to search.

దేశం అధిష్టానంపై మళ్లీ జేసీ ఆగ్రహం

By:  Tupaki Desk   |   15 March 2019 4:41 PM GMT
దేశం అధిష్టానంపై మళ్లీ జేసీ ఆగ్రహం
X
జేసీ దివాకర్ రెడ్డి. సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో చేరిన లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించారు. కొన్నాళ్ల వరకూ ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత మాట వింటూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభావం తగ్గుతోందని తెలిసినప్నప్పటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి తన అసలు రూపాన్ని చంద్రబాబు నాయుడికి చూపించడం ప్రారంభించారు. అది వటుడింతై అన్నట్లుగా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అది కాస్తా నానాటికి పెరుగుతోంది. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో అనంతపురం లోక్ సభ స్ధానం నుంచి తాను కాని - తన కుటుంబ సభ్యులు కాని పోటీ చేయాలంటే తాను చెప్పిన వారికే టిక్కట్ ఇవ్వాలంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. అనంతపురం నియోజకవర్గం పరిధిలోని అన్ని స్ధానాలను మార్చాలని - అలా కాని పక్షంలో కనీసం శింగనమల - కల్యాణదుర్గం - గుంతకల్లు శాసనసభ స్ధానాలకు ప్రకటించిన అభ్యర్ధులనైనా మార్చాలంటూ పట్టుబడుతున్నారు. అలా మార్చని పక్షంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడం ఖాయమని కూడా జె.సీ. దివాకర్ రెడ్డి తెలుగుదేశం అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.

అభ్యర్ధులకు సంబంధించి పలు అనుమానాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన స్ర్కీనింగ్ కమిటీపై కూడా జెసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. శాసనసభ అభ్యర్ధులపై తన నిరసనను తెలియజేందుకు వచ్చిన జెసీ దివాకర్ రెడ్డి సమావేశం అనంతరం సీరియస్ గా వెళ్లిపోయారు. అంతే కాదు... లోక్ సభ నియోజకవర్ద పరిధిలో ముగ్గురు అభ్యర్ధులను మార్చాలని తాను సూచించానని - ఈ స్ర్కీనింగ్ కమిటీ ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి చెబుతుందో లేదో కూడా తనకు తెలియదని జేసీ దివాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ ప్రకటించిన వారితోనే ఎన్నికల బరిలో దిగితే ఓటమి పాలు కావడం ఖాయమని, తాను ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేననే జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసమే ఇప్పుడు ప్రకటించిన అభ్యర్ధులను మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.