Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు..కేసీఆర్ చెబితే జగన్ చేస్తున్నారట!

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:41 PM GMT
మూడు రాజధానులు..కేసీఆర్ చెబితే జగన్ చేస్తున్నారట!
X
సీనియర్ రాజకీయవేత్తగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారంటే... ఎన్నెన్ని సంచలనాలు మాట్లాడతారో ఇట్టే చెప్పాల్సిన పని లేదు. సమయం, సందర్భం ఏమిటన్న విషయాన్ని అసలు పట్టించుకోకుండా... ఎంతటి పెద్ద విషయంపై అయినా ఇట్టే తన మనసులోని మాటను బయటపెట్టేసే జేసీ వైఖరితో నిజంగానే పెను వివాదాలు రేగుతున్న వైనం మనకు కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు అంశాలపై పెను సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ... తాజాగా ఏపీలో మూడు రాజధానులపై సంచలనాలకే సంచలనంగా నిలిచే వ్యాఖ్య చేశారు. ఏపీకి మూడు రాజధానులుంటే తప్పేంటన్న సీఎం జగన్... ఇప్పుడు ఏపీకి మూడు రాజధానులను చేసేస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతికి వచ్చిన జేసీ... మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానుల మాట జగన్ ది కాదని.... తెలంగాణ సీఎం కేసీఆర్ చెబితేనే జగన్ మూడు రాజధానుల బాట పట్టారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం అమరావతికి వచ్చిన సందర్భంగా మీడియా ముందు జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులను చేసేయ్ అంటూ కేసీఆర్ చెప్పినంతనే జగన్ మూడు రాజదానుల బాట పట్టారని జేసీ వ్యాఖ్యానించారు. ఆ ఒక్క మాటతోనే జేసీ ఆగరు కదా. జగన్, కేసీఆర్ ల మధ్య కొనసాగుతున్న సంబంధాలపైనా జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా జగన్ కు కేసీఆర్ వెయ్యి కొట్ల రూపాయలు సర్దుబాటు చేశారన్న మాట అప్పుడెప్పుడో వైరల్ అయ్యింది కదా. ఆ మాటను కూడా ఇప్పుడు ప్రస్తావించిన జేసీ... సీఎం కాగానే సదరు అప్పును జగన్ ఎప్పుడో తీర్చేశారని కూడా చెప్పుకొచ్చారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పుణ్యమా అని జగన్ కు బాగానే లబ్ధి చేకూరుతోందని, కేవలం ఒకే ఒక్క డీల్ లో జగన్ కు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు చేరిపోయాయని కూడా జేసీ వ్యాఖ్యానించారు.

ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ త్వరలోనే సీఎం పదవి నుంచి దిగిపోవడం ఖాయమేనని చెప్పిన జేసీ... ఏడాది, ఏడాదిన్నరలో జగన్ స్థానంలో ఆయన సతీమణి వైఎస్ భారతి ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. ఏపీకి మూడు రాజధానులన్న మాట జగన్ నోట నుంచి వినిపించినంతనే ఏపీకి వచ్చే పరిశ్రమలు రాకుండా పోయాయని కూడా జేసీ ఆరోపించారు. అయినా జగన్ కు ఏం అనుభవం ఉందని ఏపీ ప్రజలు ఏకంగా జగన్ పార్టీకి 151 సీట్లు కట్టబెట్టారని ప్రశ్నించిన జేసీ... ఏపీ ప్రజలను గొర్రెలుగా అభివర్ణించారు. జగన్ మూడు రాజధానుల ఫార్మూలాను తనదైన శైలిలో తప్పుబట్టిన జేసీ... తల ఒక చోట, మొండెం ఒక చోట, కాళ్లు ఒక చోట అన్న చందంగా పరిస్థితి తయారవుతుందని విమర్శించారు. ఇక వ్యక్తి ద్వేషం, కుల ధ్వేషమే జగన్ మూడు రాజధానుల బాటకు కారణమని కూడా జేసీ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిలో కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే భూములు లేవని, అయితే మెజారిటీ భూములు వాళ్లవేనన్న జేసీ... కమ్మ సామాజిక వర్గానికి మెజారిటీ భూములున్నా... అది రాజధానికి అడ్డంకి ఎలా అవుతుందని కూడా ప్రశ్నించారు. మొత్తంగా చాలా అంశాలను ఒకేసారి ప్రస్తావించిన జేసీ పెను సంచలనమే రేపారని చెప్పక తప్పదు.