Begin typing your search above and press return to search.

జేసీ చెప్పిన పుకారు... నమ్మేస్తారా?

By:  Tupaki Desk   |   15 Jan 2020 3:54 PM GMT
జేసీ చెప్పిన పుకారు... నమ్మేస్తారా?
X
ఏడాదిలోగా ఏపీ సీఎం మారతారా? ఏపీలో ఏం జరుగుతోంది. ఇలాంటివి ఏ సామాన్యుడో అంటే ఒకరకం... ఒక మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మామూలు జనాలు మాట్లాడే గాసిప్ లను ప్రచారం చేస్తున్నారు. ఏడాదిలో ఏపీ సీఎం మారతారట. ముఖ్యమంత్రి జగన్ స్థానంలో ఆయన భార్య వైఎస్ భారతి ముఖ్యమంత్రి అవుతారట. ఈ విషయం బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందట. అంతేకాదు... ఏపీ రాజధాని తరలింపు ముఖ్యమంత్రి మారినప్పుడల్లా మారితే ఎలా? మళ్లీ వైఎస్ భారతి వచ్చి రాజధాని ఇంకోచోటకు మారిస్తే ఏంటి పరిస్థితి అంటున్నారు జేసీ దివాకర్ రెడ్డి.

ఒకరి మూర్ఖత్వం వల్ల ఏపీకి ఈకష్టం వచ్చిందని పేరు పెట్టకుండా జగన్ పై విమర్శలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. అయితే, విశాఖలో రాజధాని ఏర్పాటుకు జగన్ అనుకుంటే అయిపోదని...అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు జేసీ. అయితే, గతంలో ఇదే మాట ప్రస్తావించిన జగన్ గురించి ఆయన చెప్పలేదు. నిండు సభలో జగన్ రాజధాని నిర్ణయం గురించి మాట్లాడుతూ ’’ఏకపక్షంగా రాజధాని నిర్ణయించారు, ఇక మేం చేసేదేముంది...‘‘ అని జగన్ అన్నమాటలు మాత్రం జేసీకి గుర్తుకు రాలేదు.

ఇక విజయసాయిరెడ్డి పై కూడా జేసీ ఆరోపణలు చేశారు. అమరావతిలో కేవలం కమ్మ వాళ్లు భూములు కొన్నారు అంటున్నారు. కానీ ఇక్కడ అందరూ భూములు కొన్నారు. కానీ ఏడు నెలలుగా వైజాగ్ లో మాత్రం విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టి వైసీపీ వర్గాలతో భూములు కొనిపించారు. తాను కూడా పెద్ద ఎత్తున భూములు కొన్నారు అని ... ఇదంతా కేసీఆర్ కోసమే చేస్తున్నారని జేసీ ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్ జగన్ కి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇపుడు ఏదో విధంగా సంపాదించి డబుల్ తిరిగి ఇవ్వడానికి వైసీపీ ఈ ప్రయోగాలు చేస్తోందని జేసీ విమర్శించారు.