Begin typing your search above and press return to search.

ప‌నికి రాక‌పోతే... ఆడి పోసుకోవ‌డ‌మేంటి జేసీ?

By:  Tupaki Desk   |   4 March 2017 5:04 AM GMT
ప‌నికి రాక‌పోతే... ఆడి పోసుకోవ‌డ‌మేంటి జేసీ?
X
నిజ‌మేనండోయ్‌... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నామ‌స్మ‌ర‌ణ లేనిదే... టీడీపీ నేత‌ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌ట‌. ప్ర‌త్యేకించి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి అయితే జ‌గ‌న్ పేరును త‌ల‌చుకోనిదే ఒక్క క్ష‌ణం కూడా నిద్ర పోలేక‌పోతున్నార‌ట‌. అందుకే ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌ - ఎప్పుడు ప‌డితే అప్పుడు - రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా... నిత్యం జ‌గ‌న్ పేరును జేసీ కల‌వ‌రిస్తూనే ఉంటారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నుంచి ఆశించిన ఫ‌లితాలు రావాలంటే... ఈ ప‌నిచేయ‌క త‌ప్ప‌ద‌ని భావించారో, ఏమో తెలియ‌దు గానీ... ఇటీవ‌ల జ‌గ‌న్‌ పై విరుచుకుప‌డ‌నిదే... జేసీ మీడియా స‌మావేశం ముగియ‌ట్లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిన్న‌టికి నిన్న త‌న అల్లుడు దీప‌క్ రెడ్ది ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన సంద‌ర్భంగా అనంత‌పురం - పెనుగొండ‌ - తాడిప‌త్రిల‌లో మీడియాతో మాట్లాడిన జేసీ... వ‌రుస‌గా జ‌గ‌న్ పై త‌న‌దైన స్టైల్లో విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయినా నిన్న‌టి సంద‌ర్భంలో జ‌గ‌న్‌పై విరుచుకుప‌డాల్సిన అవ‌స‌రం జేసీకి ఏమీ లేదు. ఎందుకంటే... స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భాగంగా అనంత‌పురం జిల్లా స్థానం కోసం జేసీ బ్ర‌ద‌ర్స్ త‌మ అల్లుడైన దీప‌క్ రెడ్డికి టీడీపీ టికెట్ ఎలాగోలా ఇప్పించేసుకున్నారు. మ‌రోవైపు క‌డ‌ప‌ - క‌ర్నూలు - నెల్లూరు జిల్లాల్లో త‌మ‌కు బ‌ల‌మున్న నేప‌థ్యంలో వైసీపీ ఆయా ప్రాంతాల్లో త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపింది. అయితే అనంత‌పురం స‌హా మిగిలిన జిల్లాల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచినా గెల‌వ‌డం క‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన వైసీపీ పోటీకి సిద్ధ‌ప‌డ‌లేదు. అయితే ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఓట్లు లేకున్నా... పోటీకి దిగే వామ‌ప‌క్షాలు త‌మ అనంత‌పురం స్థానానికి బ‌రిలోకి దిగారు.

వాస్త‌వానికి అక్క‌డ ఎన్నిక జ‌రిగినా.. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య ఆధారంగా టీడీపీ సునాయ‌సంగానే విజయం సాధిస్తుంది. అయినా ఈ విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసిన జేసీ బ్ర‌ద‌ర్స్ త‌మ అల్లుడిని ఏక‌గ్రీవంగా ఎన్నిక చేసుకునేందుకు నానా యాగీ చేశారు. వామ‌ప‌క్స అభ్య‌ర్థిని బెదిరింపుల‌కు గురి చేసి మ‌రీ... అల్లుడి ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసుకున్నారు. అల్లుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన సంతోష‌క‌ర స‌మ‌యాన్ని జేసీ దివాక‌ర్ రెడ్ది... జ‌గ‌న్‌ను విమ‌ర్శించేందుకు వాడుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీప‌క్ రెడ్డి ఎన్నిక‌కు సంబంధించి జ‌గ‌న్‌ కు గానీ, వైసీపీకి గానీ ఎలాంటి ప్ర‌మేయం లేదు. అలాగ‌ని దీప‌క్ రెడ్డిని ఓడించేందుకు ఆ పార్టీ దొడ్డిదారి య‌త్నాలేమీ కూడా చేయ‌లేదు. మ‌రి అలాంట‌ప్పుడు అల్లుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన సంద‌ర్భాన్ని జేసీ... జ‌గ‌న్ ను తిట్టిపోయ‌డానికి ఎందుకు వాడుకున్నార‌నేదే ఇక్క‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

జ‌గ‌న్ క‌ల‌లో కూడా సీఎం కాలేర‌ని, సీఎం కావాల‌న్న జ‌గ‌న్ క‌ల... క‌ల‌గానే మిగిలిపోతుంద‌ని, ఆ క‌ల‌లోనే జ‌గ‌న్ భూస్థాపితం అవుతారంటూ జేసీ త‌న‌దైన నోటి దురుసును ప్ర‌ద‌ర్శించారు. సీఎంగానే కాక ప్ర‌తిప‌క్ష నేత‌గానూ జ‌గ‌న్ ప‌నికి రారంటూ జేసీ ఓ రేంజీ ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రి జ‌గ‌న్‌ను తిట్టిపోయ‌కుంటే... దీప‌క్ రెడ్డికి చంద్ర‌బాబు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌రు క‌దా. అందుకేనేమో జేసీ నిత్యం జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నట్లుగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిన్న మీడియాతో మాట్లాడిన మూడు చోట్లా అల్లుడు విజ‌యం సాధించార‌న్న విష‌యం కంటే కూడా జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు గుప్పించేందుకే జేసీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఇదేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/