Begin typing your search above and press return to search.

జగన్ కు జేసీ అన్నిసార్లు సారీ చెప్పాల్సి వచ్చిందే?

By:  Tupaki Desk   |   7 April 2016 4:42 AM GMT
జగన్ కు జేసీ అన్నిసార్లు సారీ చెప్పాల్సి వచ్చిందే?
X
తనదోన శైలిలో మాట్లాడే ఏపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పదే పదే సారీలు చెప్పటం కనిపిస్తుంది. తోచినట్లుగా మాట్లాడటమే తప్పించి.. సారీ.. క్షమాపణలు లాంటివి చెప్పటం అలవాటు లేని జేసీ.. అందుకు భిన్నంగా బతిమిలాడుకున్న రీతిలో సారీలు చెప్పిన వైనం చూస్తే కాస్తంత విస్మయం చెందాల్సిందే. ఇంతకీ.. జగన్ కు జేసీ అంతలా సారీ చెప్పాల్సిన అవసరం ఏమిటన్న విషయంలోకి వెళితే.. మాటల ఫ్లోలో ఆయన నోరు జారటమే కారణంగా చెప్పొచ్చు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కోసం బెజవాడకు వచ్చిన జేసీ.. ఆ క్రమంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష నేత జగన్ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఊహించని రీతిలో ఆయన నోరు జారారు. నిత్యం తన తండ్రి వైఎస్ పేరును జగన్ ప్రస్తావిస్తారంటూ.. విపక్ష నేతను ఉద్దేశించి ‘‘జగన్.. వాడెబ్బ’’ అంటూ మాట తూలారు. అయితే.. తానెంత పెద్ద మాట అన్న విషయాన్ని గుర్తించిన జేసీ.. వెంటనే సర్దుకొని.. ‘‘సారీ.. సారీ.. సారీ’’ అంటూ పదే పదే క్షమాపణలు చెప్పటం కనిపించింది.

జేసీ తీరుకు భిన్నంగా.. తాను నోరు జారిన దానికి దాదాపు లెంపలేసుకున్న రీతిలో ఆయన సారీలు చెప్పటం గమనార్హం. మా వాడన్న చనువుతో తన నోటి నుంచి అలాంటి మాట వచ్చిందని.. దాన్ని తప్పుగా అనుకోవద్దని.. మరెలాంటి ఉద్దేశం లేదన్న ఆయన.. ఈ విషయాన్ని అక్కడితో వదిలేయాలని.. తప్పుగా మాత్రం రాయొద్దని పదే పదే కోరటం కనిపించింది. మనసుకు తోచింది అనేయటమే తప్పించి.. ఇంతలా సారీలు చెప్పటం అలవాటు లేని జేసీని చూసి మీడియా మిత్రులు కొద్దిపాటి ఆశ్చర్యానికి గురయ్యారు. తాను మాట్లాడింది తప్పు అన్న భావన వస్తే జేసీ తీరు ఎలా ఉంటుందన్నది బెజవాడ మీడియాకు స్వయంగా అనుభవంలోకి వచ్చిందని చెప్పాలి.