Begin typing your search above and press return to search.

చంద్రబాబు పిచ్చిపని చేశారు..జేసే సెన్సేషనల్ కామెంట్స్

By:  Tupaki Desk   |   9 Jan 2020 1:22 PM GMT
చంద్రబాబు పిచ్చిపని చేశారు..జేసే సెన్సేషనల్ కామెంట్స్
X
ఏపీ రాజధాని మార్పు అంశం రాజకీయంగా ప్రతి ఒక్కరినీ ఇన్వాల్వ్ చేస్తోంది. కీలక నేతలను విమర్శల పాల్జేస్తోంది. పాలక, విపక్షాలు రెండింట్లోనూ సొంత నేతలను తప్పు పట్టే నాయకులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో నాయకులు తమ అధినేత చంద్రబాబు వైఖరి వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటూ ఆయనపై మండిపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి - టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి తన పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పిచ్చితనం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

తాత్కాలికం, తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి పని చేశారని దివాకర్ రెడ్డి అన్నారు. అమరావతిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చెప్పారని అయితే వైసీపీ ఇప్పుడు దాన్ని వేరేలా ఉపయోగించుకుంటోందని అన్నారు. రాజధానిని ముక్కలు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. రాజధానిని కావాలంటే కడపలోనో, పులివెందులలోనో పెట్టుకోవాలని జగన్‌ను ఉద్దేశిస్తూ అన్నారు.

రాయలసీమ ప్రజలకు విశాఖ చాలా దూరమవుతుందని... చాలా ఇబ్బంది పడతారని జేసీ అన్నారు. అమరావతికి సెక్రటేరియట్ లేకుండా చేసి రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం వల్ల ఒరిగేది ఏమీ లేదని జేసీ అన్నారు. మహా అయితే ఓ 10 జిరాక్స్ షాపులు వస్తాయని... అంతకు మించి రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. రాజధానిని మార్చడం వైసీపీ నేతలు చెబుతున్నంత సులభం కాదని చెప్పారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అన్నారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చని చెప్పారు. చంద్రబాబు అప్పట్లో తాత్కాలికం అన్న మాట వాడకపోతే జగన్ ప్రభుత్వానికి ఇంత అడ్వాంటేజ్ దొరికేది కాదన్నారు.