Begin typing your search above and press return to search.

సరదా అంటూనే సీరియస్ వ్యాఖ్యలే చేసిన జేసీ

By:  Tupaki Desk   |   7 Jan 2016 4:30 AM GMT
సరదా అంటూనే సీరియస్ వ్యాఖ్యలే చేసిన జేసీ
X
తెలుగు రాష్ట్రాల్లో అధినేత మీద ఎలాంటి వ్యాఖ్య అయినా చేసే సత్తా ఉన్న అతికొద్దిమంది నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. అధినేత పట్ల అంతులేని అభిమానాన్ని ప్రదర్శించే ప్రస్తుత రాజకీయాల్లో.. తన మనసుకు తోచినట్లుగా మాట్లాడేయటం జేసీకి మాత్రమే చెల్లుతుంది. అదే సమయంలో.. ఆయన ఎప్పుడు.. ఎలాంటి వ్యాఖ్య చేసినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అస్సలు రియాక్ట్ కారు. ఆ మధ్యన ఒకట్రెండు సందర్భాల్లో జేసీని పిలిపించుకొని.. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ అడిగినట్లుగా చెప్పినా.. నిజంగా అదే నిజమైతే.. ఆయన ఇప్పటికి అలాంటి వ్యాఖ్యలే చేస్తారా అన్నది ఒక ప్రశ్న.

చంద్రబాబును పొగిడేయటం.. కొన్ని సందర్భాల్లో ఆయన ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేయటం జేసీకి అలవాటే. సరదాగా మాట్లాడినట్లు చెప్పిన అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే చూస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చచ్చినా తనకు మంత్రి పదవి ఇవ్వరు.. ఆయనతోనే తాను సరదాగా ఇదే మాట చెప్పినట్లుగా చెప్పారు.

చంద్రబాబుతో చనువుగా వ్యాఖ్యలు చేసే సామర్థ్యం జేసీకి లేదని ఎవరూ చెప్పలేరు. తనకు పదవి రాకుండా బాబు చేస్తారన్న మనసులోని మాటను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పటం జేసికి మాత్రమే చెల్లుతుంది. అంతులేని విధేయత ప్రదర్శించినా పదవులు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. ఇష్టారాజ్యంగా మాట్లాడేసే జేసీ లాంటి నేతలకు కీలక పదవులు ఇచ్చేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు. కటువుగా బదులివ్వని చంద్రబాబు లాంటి అధినేతలు.. చిరాకు పుట్టించే జేసీ లాంటి నేత చేసే వ్యాఖ్యలు భరిస్తారు. దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని గుర్తించి కాస్తంత కటువుగా వ్యవహరించాలి. లేకుండా.. సరదాగా అంటానంటూ ‘‘సీరియస్’’ వ్యాఖ్యలు బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఖాయం.