Begin typing your search above and press return to search.

ఏపీలో గెలుపెవరిదో చెప్పలేం...తమ్ముళ్ళకు జేసీ ఝలక్

By:  Tupaki Desk   |   29 March 2023 9:53 PM GMT
ఏపీలో గెలుపెవరిదో చెప్పలేం...తమ్ముళ్ళకు జేసీ ఝలక్
X
వచ్చేది మనదే రాజ్యం. ఏపీలో అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా ఎటు చూసిన పసుపు పవనాలే అంటూ తమ్ముళ్ళు తెగ హుషార్ అవుతున్నారు. సైకిల్ స్పీడ్ కి వైసీపీ నిలవలేదు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదు. ఇదీ తమ్ముళ్ల మాట. జబ్బలు చరుస్తూ నిబ్బరంగా చెప్పుకుంటున్న తీరు ఇలా సాగుతోంది.

ఏపీలో పదిహేను రోజుల క్రితం వెలువడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లను టీడీపీ గెలిచింది. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటుని కూడా సాధించింది. దాంతో ఇక కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అని తెగ హోరెత్తిస్తున్నారు తమ్ముళ్ళు.

అయితే అదే పసుపు కండువా కప్పుకుని తొమ్మిదేళ్ళుగా టీడీపీ నీడన ఉన్న మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి మాత్రం అబ్బే జనాల మూడ్ అసలు తెలవడం లేదు అంటూ ఒక్క మాటలో సైకిల్ గాలి తీసేశారు. జనాలు తెలివి మారిపోయాయి. వారు గుంభనంగా ఉంటున్నారు. ఏ మాటా బయటకు చెప్పడంలేదు. అందువల్ల జనం నాడి ఎక్కడా అందడం లేదు అని తేల్చేశారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరిది అధికారం అంటే ఇపుడే చెప్పలేమని జేసి తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. వారు నిగూఢంగా ఉన్నారు. ఏదీ బయటకు చెప్పడంలేదని అన్నారు. అంతే కాదు ఓటర్ల నాడి ఏ కోశానా అంతు చిక్కడంలేదు అని స్పష్టం చేశారు.

ఇక వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన వారు ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితులే ఉన్నాయని అన్నారు. అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి సైతం చాలా మంది జడుస్తారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల తీరు చూసినా భాష అంతగా నాయకులది బాగుండడం లేదని ఆయన విమర్శించారు

ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా చెప్పలేమని, అప్పటికి ఒక స్పష్టత రావచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం మీద వచ్చేది మేమే అని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రకటనలకు దూకుడుకు దాదాపుగా అయిదు దశాబ్దాల విశేష రాజకీయ అనుభవం ఉన్న ఈ సీనియర్ నేత చెక్ చెప్పేశారు అనే అంటున్నారు.

జేసీ అన్నారని కాదు కానీ జనాలు అయితే ఎక్కడా బయటపడడంలేదు అన్న విశ్లేషణలు ఉన్నారు. వారు అన్నీ గమనిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో మరో ఏడాదికి పైగా కొనసాగుతుంది, కాబట్టి ఈ ఏడాదిలో అనేక పధకాలు కార్యక్రమాలు ఉన్నాయి. దాంతో జనాలు కూడా ముందు తమకు అందిన వాటిని అందుకునే విషయంలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం శ్రేణుల మధ్య ఉన్న హుషార్ సంబరాలు దిగువ ప్రజలకు చేరడంలేదు అని అంటున్నారు. చూడాలి మరి జనాలు ఎపుడు బయటపడతారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.