Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదా: జేసీ మార్కు స్టేట్‌మెంట్‌

By:  Tupaki Desk   |   19 Sep 2015 9:48 AM GMT
ప్ర‌త్యేక హోదా:  జేసీ మార్కు స్టేట్‌మెంట్‌
X
టీడీపీ నాయ‌కుడు, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌దైన శైలిలో మ‌రోమారు స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా గురించి త‌ర‌చూ త‌న గ‌ళం విప్పే జేసీ ఇపుడు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌ధాని నిర్మాణంపై కూడా క‌ల‌గ‌లిపి స్పందించారు. క‌ర్నూలులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా కంటే ప్ర‌త్యేక ప్యాకేజీకి ప్రాధాన్యం ఇచ్చారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఇస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఆ దిశగా సీఎం చంద్ర‌బాబు, పార్టీ నేత‌లం కృషిచేస్తున్న‌ట్లు వివ‌రించారు. అయితే ప్ర‌త్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యం అనే భావ‌న వీడాల‌ని కోరారు. కేంద్రప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా రాష్ర్టాభివృద్ధి సాధ్యమేనని జేసీ దివాకర్‌ రెడ్డి చెప్పారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో తుది నిర్ణ‌యం రాలేద‌ని...అయితే రాష్ర్టానికి ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.

న‌వ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై రాద్దాంతం చేయ‌డం త‌గ‌ద‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మాణం అయ్యే రాజ‌ధాని ఒక్కరోజులో పూర్తి అయ్యేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విష‌యం గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కృష్ణా-గోదావ‌రి క‌లిపే ప్ర‌క్రియ సీమ‌తో పాటు కోస్తాంధ్ర‌కు మేలు చేసేద‌ని జేసీ అన్నారు. ప్ర‌జ‌లంద‌రికీ మేలు చేసే ఈ విష‌యంలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించార‌ని చంద్ర‌బాబును అభినందించారు.