Begin typing your search above and press return to search.

జేసీ వ్యాఖ్యలు.. టీడీపీకి ఫుల్ డ్యామేజ్

By:  Tupaki Desk   |   28 Dec 2018 7:01 AM GMT
జేసీ వ్యాఖ్యలు.. టీడీపీకి ఫుల్ డ్యామేజ్
X
ఆంధ్రా రాజకీయాల్లో రోజుకో నేత హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయా సందర్భాల్లో వారు చేస్తున్న వ్యాఖ్యలు ఊహించని పరిణామాలు తెచ్చిపెడుతున్నాయి. కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడితే, మరికొంత మంది కులాల ప్రస్తావనతో రాజకీయం చేస్తున్నారు. అయినా కుల ప్రస్తావన రాజకీయాలకు కొత్తేమీకాదు. కులాలే రాజకీయాలను శాసిస్తున్నాయనేది అందిరికీ తెలిసిన విషయమే. అయితే అన్ని సందర్భాలు అలానే ఉంటాయని అనుకోవడం కూడా పొరపాటే.

రెడ్డీలు అందరూ వైఎస్సార్ సీపీ వెంటే నడుస్తారన్నది జరగక పోవచ్చు. బలిజలు పవన్ కల్యాణ్ వెంట ఉంటారనేది రాంగ్ ఓపీనియన్ అవుతుంది. రాజకీయంగా పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు. రాయలసీమలో పరిస్థితి అదే విధంగా ఉంది. రెడ్డీల్లో ఎక్కువ మంది జగన్ కు - బలిజల్లో మెజార్టీ మంది పవన్ కల్యాణ్ కు ప్రస్తుతానికైతే మద్దతు పలుకుతున్నారు.

రెడ్డీల్లో తెలుగు దేశం పార్టీకి కూడా కొంత ఓటింగ్ ఉంది. జేసీ దివాకర్ రెడ్డి వంటి దశాబ్దాల కాంగ్రెస్ కు చెందినవారే టీడీపీలో ఉన్నారంటే కొంత ఓటు బ్యాంకు తెలుగుదేశం వైపు ఉంటుంది కదా. బలిజలు తెలుగు దేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంకుగా ఒకప్పుడు ఉండేవారు.. జనసేన రావడంతో కొంత ఓటు బ్యాంకు అటువైపు మళ్లింది. యూత్ అయితే జగన్ వైపే చూస్తున్నారు.

తాజాగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. జగన్ మీద ఫీలింగ్ లేని రెడ్డీల్లోనూ ఆలోచన వచ్చే విధంగా, పవన్ కల్యాణ్ ను తమ వాడిగా ఓన్ చేసుకోని బలిజలను రెచ్చగొట్టి మరీ టీడీపీకి దూరం చేసేలా ఆయన మాట్లాడారు. ఆ మాటలు విని బలిజలు పూర్తిగా టీడీపీకి దూరం అయ్యేలా ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.

జగన్, పవన్ కల్యాణ్ కులం పేరుతో రాజకీయం చేస్తున్నారని జేసీ చెప్పుకొచ్చారు. ఈ మాటలకు తటస్థులు దూరం అవుతారని అనుకోవడం పొరపాటేనని తెలుగు దేశం వాళ్లు చెబుతున్నారు. తమది కమ్మోళ్ల పార్టీ కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కమ్మోళ్ల జనాభా మూడు నాలుగు శాతం మించి ఉండదు. అక్కడ ఐదుగురు కమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా మరో కమ్మ వర్గానికి చెందిన వ్యక్తికే ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. నాలుగు శాతం జనాభా లేని చోటే కమ్మోళ్లకు అంత ప్రాధాన్యం దక్కుతుండడంపై గతంలో జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కమ్మోళ్ల రాజ్యమని తమదేమీ నడవడం లేదని వాపోయారు.

ఇప్పుడు కూడా జగన్ కు - పవన్ కు కులం అంశాన్ని అంటించే ప్రయత్నం చేశారు. జేసీ మాటలతో బలిజల్లో పవన్ మీద మరింత సానుభూతి ఏర్పడుతోందని - తమ పార్టీకి మద్దతుగా ఉన్న బలిజలను జేసీ జనసేనవైపు మళ్లిస్తున్నారని టీడీపీ నేత ఒకరు వాపోయారు.