Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో కిలోమీట‌ర్ కో ఎమ్మెల్యే ఇళ్లా జేసీ ?

By:  Tupaki Desk   |   16 April 2017 5:03 AM GMT
అమ‌రావ‌తిలో కిలోమీట‌ర్ కో ఎమ్మెల్యే ఇళ్లా జేసీ ?
X
బాధ్య‌త లేకుండా బ‌రితెగింపుతో వ్యాఖ్య‌లు చేసే నేత‌ల‌కు తెలుగు నేల మీద కొద‌వ ఉండ‌ద‌నే చెప్పాలి. కేవ‌లం త‌మ స్వార్థ‌మే త‌ప్పించి.. జ‌నాలు ఏమై పోయినా ఫ‌ర్లేద‌న్న‌ట్లుగా వీరి తీరు ఉంటుంది. సీనియ‌ర్ నేత‌లుగా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సంపాదించుకున్నా.. వారి కార‌ణంగా జ‌నాల‌కు క‌లిగిన లాభం కంటే.. వారికి క‌లిగిన లాభ‌మే భారీగా ఉంటుంద‌న్న భావ‌న క‌లిగించే నేత‌లు కోకొల్ల‌లు.

అలాంటి కోవ‌కే వ‌స్తారు ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడేసే ఆయ‌న‌.. త‌న‌ను తాను ముక్కుసూటిగా చెప్పుకుంటుంటారు. నిజ‌మే.. జ‌నాల‌కు న‌ష్టం క‌లిగిన‌ప్పుడు ఇంకేం చేయ‌గ‌ల‌మ‌ని ముక్కుసూటిగా చేతులెత్తేయ‌టం.. త‌మ ప్ర‌యోజ‌నాల‌కు దెబ్బ తినేలా నిర్ణ‌యాలు ఏవైనా తీసుకుంటే.. ముక్కుసూటిగా మండిప‌డ‌టం.. ఓపెన్ గా ఉంటార‌న్న పేరుతో మంట పుట్టే వ్యాఖ్య‌లు చేయ‌టం ఆయ‌న‌కు అల‌వాటే. తాజాగా ఆ త‌ర‌హా వ్యాఖ్య‌ల్ని చేశారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాల‌న్న విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికీ క‌ల‌గ‌నంత గొప్ప ఆలోచ‌న‌లు జేసీకి క‌లిగాయి. అమ‌రావ‌తి అభివృద్దిపై సీఎం చంద్ర‌బాబుకు.. మంత్రి నారాయ‌ణ‌ల‌కు అవ‌గాహ‌న లేద‌న్న ఆయ‌న‌.. అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెంట్ కావాలంటే ఎంపీలు.. ఎమ్మెల్యేల‌కు బ్యాంకుతో టై అప్ చేసేసి ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాలని.. కేవ‌లం ల్యాండ్ మాత్ర‌మే ఇచ్చేస్తే.. దొంగ‌త‌నంగా అమ్మేసుకునే అవ‌కాశం ఉంద‌నీ చెప్పేశారు.

నేత‌ల‌కే కాదు.. ప్ర‌భుత్వ ఆఫీస‌ర్ల‌కు.. సిబ్బందికి ఇళ్లు నిర్మించ‌కుండా అమ‌రావ‌తి అభివృద్ది ఎలా అని ప్ర‌శ్నిస్తున్న ఆయ‌న‌.. ఎమ్మెల్యేల ఇళ్ల‌ను కిలోమీట‌ర్ కు ఒక్కో ఇల్లు ఉండేలా నిర్మించాల‌ని.. అలా చేస్తే ఏ ఎమ్మెల్యేకూ మ‌రో ఎమ్మెల్యేతో గొడ‌వ‌లు ఉండ‌వ‌ని చెప్పేయ‌టం చూస్తే.. ఒక్కో ఎమ్మెల్యేల హ‌వా అమ‌రావ‌తిలో క‌నీసం కిలోమీట‌ర్ కు త‌గ్గ‌కుండా ఉండాల‌న్న‌ట్లుగా అనిపించ‌క మాన‌దు. నేత‌ల‌కు.. అధికారుల‌కు అమ‌రావ‌తిలో భూముల్ని కేటాయించేయాల‌ని చెప్పే జేసీ.. స‌గ‌టు జీవుల గురించి కూడా కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/