Begin typing your search above and press return to search.

బాబుకు జేసీ బ్ర‌ద‌ర్స్ కొత్త సిగ్న‌ల్ ఇస్తున్నారా?

By:  Tupaki Desk   |   1 Feb 2022 8:00 AM IST
బాబుకు జేసీ బ్ర‌ద‌ర్స్ కొత్త సిగ్న‌ల్ ఇస్తున్నారా?
X
అనంత‌పురం రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జేసీ దివాక‌ర్ రెడ్డి, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా త‌మ‌దైన ముద్ర క‌లిగి ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ బ్ర‌ద‌ర్స్‌ల‌లో ఒక‌రైన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా చెప్పాలంటే త‌మ పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు గురించి త‌మకున్న ఫీలింగ్స్‌ను నిర్మొహ‌మాటంగా బ‌య‌ట‌పెట్టేశారు.

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల గురించి స్పందిస్తూ తాను గెలిచిన స‌మ‌యంలో కేవ‌లం ప‌రిటాల సునీత మాత్ర‌మే ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపారు త‌ప్ప ఇత‌ర నేత‌లు త‌న‌తో మాట మాత్ర‌మైన మాట్లాడ‌లేద‌ని జేసీ ప్రభాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఏంటో అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీలో ప్ర‌స్తుతం ఉన్న నేతల రాజ‌కీయాల గురించి ఎవ‌రికి తెలియ‌ద‌ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత ప‌రిణామాలను చూస్తుంటే త‌న గుండె మండిపోతోంద‌ని, చంద్ర‌బాబు సీఎం సీటు ఎక్కిన‌ప్పుడు మాత్ర‌మే త‌న ఆవేశం త‌గ్గిపోతుంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలిపారు.

త‌న రాజ‌కీయంపై త‌మ పార్టీకి చెందిన వారు కూడా అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం చిత్రంగా ఉంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌ద‌వి పొందిన నాయ‌కుడి వ‌ద్ద‌కు తానే వెళ్లి పార్టీ బ‌లోపేతం కోసం ఏం చేసేందుకైనా సిద్ధ‌మ‌ని తాను చెప్పాన‌ని, అయిన‌ప్ప‌టికీ వారి వైపు నుంచి స్పంద‌న లేద‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త‌మ ప‌రిస్థితి గురించి కూడా ఒక్కోసారి గంద‌ర‌గోళం ఏర్ప‌డుతోంద‌ని వాపోయారు. తాను ఇందిరాగాంధీ ధైర్యానికి, త‌మ‌కు అండ‌గా నిలిచిన సంజీవ‌రెడ్డి గొప్ప మ‌న‌సుకు , తాను ఎదిగిన తీరు ప‌ట్ల చంద్ర‌బాబును చూసి, త‌మ‌పై ప్రేమాభిమానాలు క‌లిగి ఉన్న వ్యక్తి కాబ‌ట్టి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే అభిమానిస్తాన‌ని తెలిపారు. అనంత‌పురం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో తామెప్పుడూ క‌న్ఫ్యూజ‌న్‌లో లేమ‌ని జేసీ తెలిపారు. తాము చేయాల‌నుకున్న‌ది చేస్తామ‌ని ఈ విష‌యంలో ఎలాంటి సందేహాలు అవ‌సరం లేద‌న్నారు. స్థానిక రాజ‌కీయాల గురించి త‌మ నాయ‌కుడికి ఏం చెప్తున్నారో ఏంటో అర్థం కావ‌డం లేద‌ని ప‌రోక్షంగా త‌మ అసంతృప్తిని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌క్తం చేశారు.