దివాకర్ రెడ్డి.. ఫ్యాక్షన్ రాజకీయమా అదెలా ఉంటుందబ్

Thu Jan 23 2020 07:00:02 GMT+0530 (IST)

jc Diwakar Reddy In Andhra politics

రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఇమేజ్ ఉన్న రాజకీయ నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. ఫ్యాక్షన్ రాజకీయం మిళితం అయిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ప్రస్తుతానికి నాటి ఫ్యాక్షన్ హవా లేకపోయినా.. ఒకప్పుడు అయితే ఫ్యాక్షన్ రాజకీయాలు అక్కడ ఒక ఊపు ఊపాయి. వాటిల్లో జేసీ కుటుంబం కూడా ఒకటిగా సాగింది.నాటి ఫ్యాక్షన్ ఇమేజ్ నేతలతో జేసీ సోదరులు రాసుకుపూసుకు తిరిగారు. అలాగే జేసీ అనుచరవర్గం పలు ఫ్యాక్షన్ హత్యల్లో ఆరోపణలు ఎదుర్కొంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే నాటి తెలుగుదేశం నేత కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి హత్య కేసులో జేసీ ముఖ్య అనుచరులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలా ఫ్యాక్షన్ రాజకీయంలో జేసీ రాజకీయం కూడా భాగం అయ్యింది.

ఇక పరిటాల వర్గంతో ఒకప్పుడు జేసీ వర్గానికి పడేది కాదు. పరిటాల రవికి పెద్ద ఫ్యాక్షన్ ఇమేజ్ ఉంది. ఒక దశలో ఈ ఇరు వర్గాలూ తాడిపత్రి స్థాయిలో తలపడ్డాయి. అప్పట్లో రవికి జేసీ భయపడ్డారు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాగే పరిటాల రవి హత్య సమయంలో జేసీ పై గట్టిగా ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీ.

ఇప్పుడైతే  చంద్రబాబుకు జేసీ సన్నిహితుడు కానీ అప్పుడైతే.. పరిటాల రవి హత్యలో జేసీ హస్తం ఉందని చంద్రబాబు నాయుడు పరిటాల సునీత ఆరోపించారు. ఇలా అనంతపురంలో సాగిన ఫ్యాక్షన్ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి పేరు నానుతూ వచ్చింది. అలాంటి జేసీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయం చేస్తున్నారట. ఏపీకి మూడు రాజధానులు ఏర్పరచడం ఫ్యాక్షన్ రాజకీయం అట. ఇదీ జేసీ మాట. మూడు రాజధానులు ఏర్పరచడాన్ని కూడా ఈయన ఫ్యాక్షన్ రాజకీయం అంటున్నాడు. తన పేరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో నానిన ఒక నేత.. ఇలా మూడు ప్రాంతాలకు అనుకూలమైన నిర్ణయాన్ని ఫ్యాక్షన్ రాజకీయం అనడం ఎంత ప్రహసనం ఉందంటే అంత ప్రహసనంగా ఉంది!