Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో పోటీపై వ్యూహాన్ని చెప్పిన జేపీ

By:  Tupaki Desk   |   23 Oct 2016 11:00 AM IST
ఎన్నికల్లో పోటీపై వ్యూహాన్ని చెప్పిన జేపీ
X
లోక్ సత్తా పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి.. వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుతో సరికొత్త చైతన్యాన్ని తీసుకురావటంలో సక్సెస్ అయిన ఆ సంస్థ అధినేత జయప్రకాశ్ నారాయణ.. తర్వాతి దశలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. తన కలల్ని ఆవిష్కరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే తీరులోనే.. తమ పార్టీ తెలుగు ప్రజల్ని మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతుందని.. కేవలం పదేళ్ల వ్యవధిలో జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తుందని ఆ పార్టీని ప్రారంభించిన సందర్భంగా జేపీ చెప్పిన మాటలు అప్పట్లో పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

రాజకీయ పార్టీగా తామేం చేస్తామన్న విషయంపై జేపీ ఐడియాలజీ విన్న వారు ఎవరైనా.. ఆయన మాటలకు నోరు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. చెప్పే మాటలన్నీ చేతల్లో చేసి చూపించటం అంత తేలికైన విషయం కాదు. అందులోకి జేపీ లాంటి వ్యక్తి.. రాజకీయాల్లాంటి వాటికి ఫిట్ కారన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని జేపీ దృష్టికి తీసుకెళ్లినా.. తనను తాను ‘సూపర్ మ్యాన్’గా ఫీలయ్యే ఆయన.. వారి మాటల్ని ఏ మాత్రం లక్ష్య పెట్టేవారు కాదు. ‘మీరు చూస్తుండండి.. దేశ రాజకీయాల్నిప్రభావితం చేస్తాం. ఆ నమ్మకం నాకుంది’ అంటూ తన చుట్టూ ఉన్న వారితో జేపీ తరచూ వ్యాఖ్యానించేవారని చెబుతారు.

అంత నమ్మకం ఉన్న పెద్ద మనిషి.. చివరకు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజలకు ఎంతో కీలకమైన విభజన ఇష్యూలో జేపీ వేసిన కుప్పిగంతలు అన్ని ఇన్ని కావు. కీలక అంశం విషయంలో ఆయన తీరు పుణ్యమా అని తెలుగు ప్రజలకు ఆయనపై నమ్మకం పోయేలా చేసిందని చెప్పక తప్పదు. విభజన అనంతరం ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేని నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండటం.. ఆ తర్వాత నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.

ఆ మధ్యన ప్రత్యక్ష ఎన్నికల్లో తాము పోటీ చేయమన్న మాటను చెప్పిన జేపీ.. తాజాగా అందుకు భిన్నమైన వ్యాఖ్య చేశారు. పార్టీ పదో వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన జేపీ.. తమ పార్టీ అధికారంలోకి రాకున్నా.. దేశంలో ఎక్కువ ప్రభావం చూపించింది.. చూపిస్తున్న పార్టీ తమదేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయమని.. తమ పార్టీ రద్దు అయ్యిందని ప్రచారం జరిగిందని.. అందులో నిజం లేదని చెప్పారు. ఎన్నికల్లో లోక్ సత్తా పోటీ చేయకపోవటం తాత్కాలిక విరామమే తప్పించి.. ఆట నుంచి వైదొలిగినట్లు కానేకాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవటం అన్నది ఒక వ్యూహమే తప్పించి శాశ్వితం కాదని చెప్పిన జేపీ మాటలు వింటే ఆశ్చర్యం పక్కా. రానున్న రోజుల్లో ఈ తరహా వ్యూహాలు మరెన్ని చెబుతారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/