Begin typing your search above and press return to search.

జేపీ సంచ‌ల‌నం!... జేఎఫ్‌ సీ ప్లేస్‌ లో ఐజీఈ!

By:  Tupaki Desk   |   29 March 2018 6:05 AM GMT
జేపీ సంచ‌ల‌నం!... జేఎఫ్‌ సీ ప్లేస్‌ లో ఐజీఈ!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌స్తుతం సాగుతున్న ఉద్య‌మం నేప‌థ్యంలో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఒక మాట చెబితే... దానికి విరుద్ధంగా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్ర‌భుత్వం చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అస‌లు ఎవ‌రు చెబుతున్న మాట క‌రెక్టో తెలియ‌న జ‌నం అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఎవ‌రు ఏం చెప్పినా... ఏపీకి అన్యాయం జ‌రిగిన మాట వాస్త‌వ‌మ‌ని న‌మ్ముతున్న జ‌నం... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరు సాగిస్తున్న దాదాపు అన్ని పార్టీల‌కు కూడా మ‌ద్ద‌తు ప‌లికేందుకు సిద్ధంగానే ఉన్నారు. అయితే మొన్నామ‌ధ్య... బీజేపీ - టీడీపీ ప్ర‌భుత్వాలు చెబుతున్న మాటల్లో ఏ మాట క‌రెక్టో తాను తేల్చేస్తానంటూ టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి ఏం చేశార‌న్న విష‌యంలో బీజేపీ త‌న మాటగా అన్నీ చేశామ‌ని చెబుతుంటే... ఏమీ చేయ‌లేద‌ని టీడీపీ ప్ర‌భుత్వం చెబుతున్న వైనాన్ని గుర్తు చేసిన ప‌వ‌న్‌... నిజ‌మేమిటో తాను నిగ్గు తేలుస్తానంటూ రంగంలోకి దిగారు.

ఈ క్ర‌మంలో సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ - పేరు మోసిన బ్యూరోక్రాట్‌ గానే కాకుండా నీతివంత రాజ‌కీయాల‌కు పునాది వేస్తానంటూ ఐఏఎస్ ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేసి లోక్ స‌త్తా పేరిట జ‌నంలోకి వ‌చ్చేసి జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ - సీపీఎం - సీపీఐ నేత‌ల‌ను క‌లిసిన ప‌వ‌న్ క‌ల్యాణ్... వారి ఆధ్వ‌ర్యంలోనే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ (జేఎఫ్‌ సీ) పేరిట ఓ క‌మిటీని కూడా వేశారు. తొలుత కాస్తంత హ‌డావిడి చేసిన ప‌వ‌న్ ఇప్పుడు అస‌లు దాని విష‌య‌మే మ‌రిచిపోయారు. ఈ క్ర‌మంలో ఇలాగైతే కుద‌ర‌ద‌నుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ... ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు భారీ దెబ్బ కొడుతూ జేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. జేఎఫ్‌సీ త‌ర‌హాలోనే ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌ ప‌ర్ట్స్‌(ఐజీఎఫ్‌) పేరిట ఓ క‌మిటీని ప్ర‌కటించేశారు.

ఈ క‌మిటీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజ‌నేయ రెడ్డి - ఫార్మ‌ర్స్ యూనియ‌న్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ చెంగ‌ల్ రెడ్డి - మాజీ డీజీపీ హెచ్‌జే దొర‌ - 14వ ఆర్థిక సంఘం స‌భ్యుడు గోవింద‌రావు - హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎంఎన్ రావు - ఉమ్మ‌డి ఏపీ మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కాకి మాధ‌వ‌రావు - కేంద్ర హోం శాఖ మాజీ కార్య‌ద‌ర్శి ప‌ద్మ‌నాభ‌య్య‌ - ఏపీ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జస్టిస్ ప‌ర్వ‌త‌రావు - మాజీ న్యూస్ ఎడిట‌ర్ విశాలాంధ్ర రాఘ‌వాచారి - కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుజాతా రావు - ప్ర‌ధాని మాజీ కార్య‌ద‌ర్శి కేఆర్ వేణుగోపాల్‌ - ప్రొఫెస‌ర్ ఎస్ గ‌లాబ్‌ - ప్రొఫెస‌ర్ రాధాకృష్ణ త‌దిత‌రుల‌తో ఈ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు జేపీ ప్ర‌క‌టించారు. క‌మిటీలో తాను కూడా కీల‌క భూమిక పోషించ‌నున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాకుండా క‌మిటీలోకి మ‌రిన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు రావాల్సి ఉంద‌ని, ఈ త‌ర‌హాలో ఆస‌క్తి ఉన్న అంద‌రికీ ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్లుగానే జేపీ ప్ర‌క‌టించారు.

ఈ మేరకు లోక్ స‌త్తా నుంచి నిన్న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ క‌మిటీ తొలి స‌మావేశం ఈ నెల 30న జ‌రుగుతుంద‌ని కూడా జేపీ ఆ ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌క‌టించేశారు. అయినా ఉన్న‌ట్టుండి ప‌వ‌న్ జేఎఫ్ సీ లో స‌భ్యుడిగా ఉన్న జేపీ ప్ర‌త్యేకంగా క‌మిటీ ఎందుకు ఏర్పాటు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే.. అస‌లు ప‌వ‌న్‌కు తాను ఏర్పాటు చేసిన క‌మిటీపైనే న‌మ్మ‌కం లేద‌న్న భావ‌న ఉన్న‌ట్లుగా జేపీ గ్ర‌హంచార‌ట‌. అంతేకాకుండా రాజ‌కీయంగా ఎప్ప‌టిప్పుడు క‌న్ఫూజ‌న్ మైండెడ్‌తో ముందుకు సాగుతున్నార‌ని, ఈ క్ర‌మంలో జేఎఫ్‌ సీతో ప‌ని కాద‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చిన త‌ర్వాతే జేపీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా పాల‌న‌లో అపార అనుభ‌వం గ‌డించిన జేపీ తోనూ ప‌వ‌న్ ఛీకొట్టించుకున్న‌ట్టుగా ఉంద‌ని ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.