Begin typing your search above and press return to search.

పాపం.. ఆయనకూ కులం అంటగడతారేమో!

By:  Tupaki Desk   |   12 Oct 2017 4:37 AM GMT
పాపం.. ఆయనకూ కులం అంటగడతారేమో!
X
లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ్.. ప్రస్తుత రాజకీయాల్లో ఏ విషయం మీదనైనా సరే.. నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యక్తి. మాజీ ఐఏఎస్ గా - సామాజిక ఉద్యమకారుడిగా రాజకీయ నాయకుడిగా నిజాయితీ గల మేధావిగా ఆయన ప రజల్లో కూడా గుర్తింపు ఉంది. సమకాలీన వ్యవహారాలపై ఆయన తరచుగా తన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటారు. అలాంటి జయప్రకాష్ ఇప్పుడు తొలిసారిగా.. ఇటీవలి కాలంలో కులాల మధ్య కార్చిచ్చులాగా మారిన కంచ ఐలయ్య పుస్తకం గొడవలో కూడా తల దూర్చారు. వైశ్యుల గురించి కంచ ఐలయ్య రాసిన రాతలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కులమతాల పేరిట నొప్పించే రాతలు తగవని కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు దేశంలో పరిస్థితి ఎలా మారిపోయిందంటే.. ఒక వివాదం రేకెత్తినప్పుడు అందులో మంచి చెడులను గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. కులాల్ని బట్టి వర్గాలుగా చీలిపోతున్నారు.

ఐలయ్య వ్యవహారం కూడా అలాగే తయారైంది. ఐలయ్య ఒక కులం గురించి నానా అవాకులు చెవాకులు పేర్చి తనకు తోచినవన్నీ ‘కులం లక్షణాలు’గా ఆపాదించి పుస్తకం రాసేస్తే.. దాన్ని వ్యతిరేకించిన వారందరి మీద దళిత వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి కులాల పరంగా ప్రయత్నం జరుగుతోంది. ఐలయ్య వ్యవహారం కూడా అలాగే తయారైంది. మేధావులుగా ఉద్యమకారులుగా పేరు కోరుకునే సూడో ప్రజాస్వామిక వాదులంతా కూడా ఐలయ్యను సమర్థించడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.

ఇలాంటి నేపథ్యంలో లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ మాటలకు ఎంతో ప్రాధాన్యం దక్కుతోంది. కులాలను నొప్పించేలా ఇలాంటి రాతలు సరైనవి కాదంటూ... జేపీ చేసిన మాటలకు కనీసం మేధావులుగా చెప్పుకునే వారిలోనైనా ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. లక్షణాలు అనేవి వ్యక్తుల నేపథ్యాలను బట్టి, అనుభవాలను బట్టి, బుద్ధులను బట్టి ఏర్పడుతాయి గానీ.. ప్రాంతాలను బట్టి కులాలను బట్టి ఏర్పడతాయంటూ ఆపాదించడం సరైనది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవ్వరు ఏం మాట్లాడిన దానికి కుల అహంకారం ఆపాదిస్తూ వచ్చిన ఐలయ్యను సమర్థించే వారు... లోక్ సత్తా జయప్రకాష్ కు కూడా.. కులాన్ని, అగ్రకుల అహంకారాన్ని అంటగడుతారా... లేదా, ఆయన చెప్పిన మాటల్లోని ఔచిత్యాన్ని అర్థం చేసుకుని ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడతారా వేచిచూడాలి.