Begin typing your search above and press return to search.

పవన్ - హోదా పై జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   30 March 2018 11:26 AM GMT
పవన్ - హోదా పై జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఇప్పుడు ఏపీలో ఎక్క‌డ చూసినా... రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం జ‌రుగుతున్న పోరాటం గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. విప‌క్షాలతో పాటుగా అధికార పార్టీ టీడీపీ కూడా ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మిస్తున్న నేప‌థ్యంలో అన్ని పార్టీల కార్య‌కర్త‌ల‌త‌తో పాటుగా సామాన్య జ‌నం కూడా ప్ర‌త్యేక హోదా పోరుపైనే చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం జ‌రుగుతున్న పోరులో ఏ పార్టీ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది? ఏ పార్టీ నిబ‌ద్ధ‌త‌తో పోరాడుతోంద‌న్న వాద‌న కూడా ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. ఈ చ‌ర్చ బాగానే ఉన్నా అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ్య‌మేనా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు స‌రికొత్త ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని,. 14వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌ల మేర‌కే ఈ మాట చెబుతున్నామ‌ని - అయినా ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నింటినీ ఏపీకి ఇచ్చేందుకు తాము సిద్ధ‌మేన‌ని - అయితే ఆ నిధుల‌న్నింటినీ ప్ర‌త్యేక ప్యాకేజీ కింద ఇస్తామ‌ని కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు... గ‌డ‌చిన నాలుగేళ్లుగా పాడుతున్న పాటేన‌న్న విష‌యం తెలిసిందే.

ఈ పాట‌కు తాళ‌మేసిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ... నాలుగేళ్ల పాటు సైలెంట్‌గానే ఉండిపోయి... ఇప్పుడే ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని కొత్త రాగం అందుకుంద‌ని కూడా జ‌నం చ‌ర్చించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీ (జేఎఫ్‌ సీ)లో స‌భ్యుడిగా ఉన్న లోక్ స‌త్తా వ్య‌వ‌స్థాప‌కుడు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌.... ఇప్పుడు జేఎఫ్‌ సీకి స‌మాంత‌రంగా ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌ప‌ర్ట్స్‌(ఐజీఎఫ్‌) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క‌మిటీ స‌మావేశం హైద‌రాబాదులో నేటి మ‌ధ్యాహ్నం మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన జేపీ... ప‌వ‌న్ క‌ల్యాణ్ - జ‌న‌సేన ఏర్పాటు చేసిన జేఎఫ్‌ సీల‌తో పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదాపైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చే అవ‌కాశాలు ప్ర‌స్తుతం లేద‌ని వ్యాఖ్యానించిన జేపీ.. ఈ విష‌యం ఏ ఒక్కరికీ తెలియ‌ని మ‌ర్మ‌మేమీ కాద‌ని, చాలా కాలం క్రిత‌మే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల‌కు ఈ విష‌యం తెలిసిందేన‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మొత్తంగా రాద‌ని భావించిన ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ స‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు ఎందుకు పోరాటం చేస్తున్నాయ‌న్న కొత్త అనుమానాన్ని జేపీ ప్ర‌జ‌ల్లో రేకెత్తేలా చేశార‌నే చెప్పాలి. ప్ర‌త్యేక హోదాపై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేసిన జేపీ... అస‌లు ప్ర‌త్యేక హోదాను అంద‌రికంటే ముందుగా ప్ర‌స్తావించింది తానేన‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ వైఖ‌రిపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డిన జేపీ... సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌ సీ) పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదట శ్రద్ధ చూపించి తరువాత పట్టించుకోవడం లేదని అన్నారు. జేఎఫ్‌సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశానని తెలిపారు. జేఎఫ్‌ సీ తొలిదశ అయితే, స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అని వ్యాఖ్యానించారు. తాము చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సమయం ఇస్తే వెళ్లి కలుస్తామని తెలిపారు.