Begin typing your search above and press return to search.

మోడీని సమర్థించినందుకు ఫీలవుతున్నాడట

By:  Tupaki Desk   |   8 Jan 2017 5:39 AM GMT
మోడీని సమర్థించినందుకు ఫీలవుతున్నాడట
X
మేధావిని సైతం ప్రధాని మోడీ బురుడీ కొట్టించగలరా? ప్రతి విషయాన్ని కూలంకూషగా చర్చించి.. అందులోని లోతుపాతుల గురించి విశ్లేషించే గుణం ఉన్నవారు సైతం.. మోడీ మాటలు చెప్పిన వెంటనే.. దాని ముందు వెనుకా ఏం ఉంది? ఏం లేదు? అన్న విషయాన్ని చూసుకోకుండానే గుడ్డిగా సమర్థించేస్తారా? అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకుంటే.. దాని పరిణామాలపై లోతుగా అధ్యయనం చేయకుండా మాటలు చెప్పేసి.. ఆ తర్వాత తీరిగ్గా తప్పు పడతారా? నమ్మేశానని చెప్పటంతోనే సరిపోతుందా? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. లోక్ సత్తా అధినేత కమ్ మేధావి అయిన జయప్రకాశ్ నారాయణ మాటలు వింటే కాస్తంత ఆశ్చర్యమనిపించక మానవు.

పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని సమర్థించిన మేధావుల్లో జయప్రకాశ్ నారాయణ ఒకరు. అలాంటి ఆయన తర్వాతి కాలంలో రద్దు నిర్ణయాన్నితప్పు పట్టటం తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన జేపీ.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెనుక ఆశయం ఎంత మంచిదే అయినా.. ఆచరణ మాత్రం దేశాన్ని గందరగోళంలోకి నెట్టిందని జేపీ ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాల్ని తీసుకోవటం అనుచితమన్న జేపీ.. రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఆ నిర్ణయానికి మద్దుతు ప్రకటించిన వారిలో తాను ప్రథముడినని.. పర్యవసానాలు గమనించిన తర్వాత ఇదెంత అనాలోచిత చర్యో అర్థమైందన్నారు. జేపీ లాంటి మేధావే ఇలా తప్పులో కాలేస్తే.. సామాన్యుల సంగతేంది? అయినా.. మామూలోళ్లు అయితే.. ఏదో తొందరపాటుతో ఏదో మాట్లాడేస్తారని సర్ది చెప్పుకోవచ్చు. అపర మేధావులు సైతం మామూలు మనుషుల మాదిరి భావోద్వేగాలకు గురై.. పొగిడేయటం.. ఆ తర్వాత తీరిగ్గా తిట్టేయటం ఏమిటి జేపీ గారు? మీలాంటి మేధావుల కారణంగా జరిగే నష్టం ఏమిటంటే.. ఎంతో లోతుగా ఆలోచిస్తారని భావించి.. గుడ్డిగా నమ్మే సామాన్య జనాల నమ్మకం మీద మీరు దెబ్బేస్తారు. సాదా సీదా జనం మాదిరి మీరు కూడా తొందరపడి మాట్లాడేయటం.. ఒక నిర్ణయాన్ని ప్రకటించేయంటం.. ఆ తర్వాత తీరిగ్గా చింతించటం ఏంది? మోడీ లాంటోల్ల కారణంగా జరిగే నష్టమే కాదు.. మీలాంటోళ్ల వల్ల కూడా నష్టం వాటిల్లితే ఇంక ఎవరిని నమ్మాలంటారా? అయినా.. మీలాంటి మేధావుల జడ్జిమెంట్ లో తేడా రావడమేంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/