Begin typing your search above and press return to search.

ఆటో ఛార్జ్ కంటే ఫ్లైట్ టికెట్ త‌క్కువ‌...!

By:  Tupaki Desk   |   5 Sep 2018 1:30 AM GMT
ఆటో ఛార్జ్ కంటే ఫ్లైట్ టికెట్ త‌క్కువ‌...!
X
ఎవ‌రండి చెప్పేది. ఎవ‌రు చెబితే మాత్రం న‌మ్మేస్తారా? మ‌రీ.. ఎట‌కారంగా క‌నిపిస్తున్నామా? చెవుల్లో క్యాలీఫ్ల‌వ‌ర్లు పెట్టుకున్నామా? అన్న కోపం రావొచ్చు. కానీ.. కేంద్ర‌మంత్రి జ‌యంత్ సిన్హా చెప్పేది వింటే అవున‌ని చెప్ప‌ట‌మే కాదు.. నిజ‌మేగా అని మీరు సైతం మ‌రొక‌రితో చెప్పే ఉదాహ‌ర‌ణ‌ను ఆయ‌న చెబుతున్నారు.

దేశంలో ఆటో ఛార్జీల కంటే కూడా విమాన ఛార్జీలే త‌క్కువ‌ని చెబుతున్న జ‌యంత్‌.. ఆ లెక్క‌ను ఆయ‌న మాట‌ల్లోనే చెప్పాలంటే.. "విమాన‌యానం చ‌వ‌కైంది. ఈ రోజుల్లో ఆటో రిక్షా కంటే విమాన ఛార్జిలు త‌క్కువంటే ఎలా అని మీరు ప్ర‌శ్నిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఇద్ద‌రు వ్య‌క్తులు ఆటో రిక్షాలో రెండు కిలోమీట‌ర్లు వెళితే రూ.10 చెల్లిస్తారు. అంటే.. కిలోమీట‌రుకు రూ.5 చొప్పున చెల్లిస్తున్న‌ట్లు. అదే విమానంలో అయితే కిలోమీట‌ర్ కు రూ.4 మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నాం" అని ఉదాహ‌ర‌ణ‌ను చెప్పుకొచ్చారు.

ఇలా విమాన‌యానాన్ని ప్ర‌మోట్ చేసే కేంద్ర‌మంత్రి ఇలాంటి మాట‌లు ఆయ‌న నోటి నుంచి రావ‌టం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ఆయ‌న ఇదే త‌ర‌హాలో చెబుతుంటారు. ఇవాల్టి రోజున ఇండోర్ నుంచి ఢిల్లీకి విమాన మార్గంలో వెళ్లే ప్ర‌యాణికులు కిలోమీట‌ర్ కు రూ.5 చొప్పున మాత్ర‌మే చెల్లిస్తున్నార‌ని చెప్పారు. అదే.. ఆటో రిక్షాలో అయితే కిలోమీట‌ర్ కు రూ.8 నుంచి రూ.10 మ‌ధ్య‌లో వ‌సూలు చేస్తార‌ని చెబుతున్నారు.

ఇన్ని మాట‌లు చెబుతున్న ఆయ‌న‌.. గ‌డిచిన కొన్నేళ్లుగా విమాన‌యాన రంగం వృద్ధి చెందుతోంద‌న్నారు. నాలుగేళ్ల కింద‌ట ఏడాదికి 11 కోట్ల మంది విమానాల్లో ప్ర‌యాణిస్తే.. ఇప్పుడా సంఖ్య 20 కోట్ల‌కు చేరుకుంద‌న్న విష‌యాన్ని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య‌ను వంద కోట్ల‌కు పెంచ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. మ‌రికాస్త‌.. ధ‌ర‌లు త‌గ్గిస్తే.. మ‌రో రెండేళ్ల‌లో ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌టం క‌ష్ట‌మైన ప‌ని ఎంత‌మాత్రం కాదు.