Begin typing your search above and press return to search.

ఆ మంత్రి ఇచ్చిన టీ పార్టీ ఆయన శాఖనే మార్చేసింది

By:  Tupaki Desk   |   7 July 2016 6:00 AM GMT
ఆ మంత్రి ఇచ్చిన టీ పార్టీ ఆయన శాఖనే మార్చేసింది
X
మోడీకి ఒళ్లంతా కళ్లేనా అన్న ఆసక్తికర చర్చ పార్టీలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. రెండు రోజుల క్రితం భారీగా తన క్యాబినెట్ ను పునర్ వ్యవస్థీకరించిన సందర్భంగా కొన్ని మార్పులు ఆసక్తికరంగా మారాయి. దీనికి సంబంధించిన అంశాలపై లోతుగా దృష్టి పెడితే.. మోడీ ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తున్న ఏ ఒక్కరిని ఆయన వదిలిపెట్టటం లేదన్న మాట వినిపిస్తుంది. తన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. సమర్దుడిగా పేరు పొందిన ఒక మంత్రి శాఖను ఇట్టే మార్చేయటంపై పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.

మోడీ లాంటి నేత ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాని వెనుక ఏదో లెక్క ఉంటుందన్న నమ్మకంతో లోతుల్లోకి వెళ్లగా.. ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. తాను చేసే ప్రతి మార్పు వెనుక ఎంతోకొంత విషయం ఉంటుందన్న విషయం తాజా ఉదంతం తేలుస్తుందని చెప్పాలి. బీజేపీ సీనియర్ నేత.. గతంలో కేంద్ర ఆర్థికమంత్రిగా వ్యవహరించిన యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా రాజకీయాల్లో అరంగ్రేటం చేసిన సమయంలోనే ఆయనకు తన కేబినెట్ లోచోటు కల్పిస్తూ మోడీ నిర్ణయం తీసుకున్నారు.

తండ్రి మాదిరే ఆర్థిక అంశాల మీద పట్టున్న జయంత్ కు ఆర్థికశాఖలో సహాయమంత్రి బాధ్యతల్ని అప్పగించారు. ఆయనకు అప్పజెప్పిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్న పేరు ప్రఖ్యాతుల్నిసంపాదించుకున్నారు. అలాంటి ఆయన్ను తాజాగా జరిగిన విస్తరణలో ఆర్థిక శాఖ నుంచి పౌరవిమానయాన సహాయమంత్రిగా మార్చటంపై ఆసక్తి వ్యక్తమైంది. ఎందుకిలా? అన్న సందేహంపై లోతుగా దృష్టిసారిస్తే.. ఈ మధ్యన పలువురు బ్యాంకర్లతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తులతో కలిపి తన ఇంట్లో ఆయన టీ పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మోడీ.. మరోమాట లేకుండా ఆయన శాఖను మార్చినట్లుగా చెబుతున్నారు. ఒక టీ పార్టీ కీలకమైన శాఖ నిర్వహించే బాధ్యతను జయంత్ చేజార్చుకున్నారన్న మాట ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. చూస్తుంటే.. ఎవరికి ఎలాంటి చాన్స్ ఇచ్చేందుకు మోడీ సిద్ధంగా లేరన్నట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.