Begin typing your search above and press return to search.

మహా సుడిగాడు జయమంగళ వెంకటరమణ.. పార్టీలో చేరిన 2 రోజులకే ఎమ్మెల్సీ పదవి

By:  Tupaki Desk   |   21 Feb 2023 3:00 PM GMT
మహా సుడిగాడు జయమంగళ వెంకటరమణ.. పార్టీలో చేరిన 2 రోజులకే ఎమ్మెల్సీ పదవి
X
పార్టీ కోసం ఏళ్లకు ఏళ్లుగా పని చేసినా అధినేత గుర్తింపు నోచుకోక.. పదవులు రాక కిందా మీదా పడిపోతుంటారు పలువురు నేతలు. అందుకు భిన్నంగా మరికొందరు తీరు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వీరికి మించిన మహా సుడిగాళ్లు ఇంకెవరు ఉండరన్నట్లుగా ఉంటుంది. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా సుడి నేతలు అంటే.. తెలంగాణకు చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను చెప్పాలి. ఫార్టీలో చేరుతున్నంతనే మంత్రి పదవిని పొందిన ఆయన్ను మహా సుడిగాడు అని అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. కాకుంటే ఈసారి జరిగింది ఏపీలో.

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన తమ పార్టీ అభ్యర్థుల పేర్లను సోమవారం జగన్ సర్కారుకు సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించటం తెలిసిందే. మొత్తం 18 మంది అభ్యర్థుల్లో వివిధ సామాజిక వర్గాలకుచెందిన వారు ఉండటం తెలిసిందే. మొత్తం 18 స్థానాల్లో స్థానిక సంస్థల కోటాలో 9 మందిని.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురిని.. గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థుల్ని ఎన్నుకుంటారు. దీనికి సంబంధించిన అభ్యర్థులను ఏపీ అధికార పక్షంవెల్లడించింది.

ఈ పేర్లలో కైకలూరుకు చెందిన జయ మంగళ వెంటకరమణ పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి వైసీపీ వర్గాలు సైతం ఈ పేరుపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ కానున్న ఆయన.. కేవలం రెండు రోజుల ముందే వైసీపీలో చేరటం.. ఆ వెంటనే ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో చేరిన రెండు రోజులకే ఎమ్మెల్సీ పదవిని జగన్ కట్టబెట్టటంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఒకవైపు ఏళ్లకు ఏళ్లుగా పార్టీలో ఉన్నా గుర్తింపునకు నోచుకోని నేతలు.. పదవులు రాని వారు బోలెడంత మంది ఉంటే.. పార్టీలో చేరిన రెండు రోజులకే పదవి రావటమా? అన్నది ప్రశ్నగా మారింది. జయ మంగళ వెంకటరమణ పేరును ఎంపిక చేయటంపై కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇంతకూ ఆయన్ను జగన్ ఎందుకు ఎంపిక చేసినట్లు? ముందుగా ఇచ్చిన మాట కోసమే ఆయనకు పదవిని కట్టబెట్టారా? అన్నది ప్రశ్నగా మారింది.

వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవిని ఎందుకు కేటాయించినట్లు? అన్న ప్రశ్నకు వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం చూస్తే.. ఆయన 2019లో టీడీపీఅభ్యర్థిగా బరిలోకి దిగి 9వేల ఓట్ల తేడాతో ఓడారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో ఆయన ప్రజల్లో తిరగటం షురూ చేశారు. అయితే.. అప్పట్లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పటం.. అది కార్యరూపం దాల్చకపోవటంతో కినుకుతో ఉన్నట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో వెంకట రమణ బరిలోకి దిగితే పార్టీకి నష్టం జరుగుతుందన్న అంచనాతో పాటు.. బాబుకు బలంగా ఉండే నేతల్ని పార్టీలోకి తీసుకురావటం ద్వారా దెబ్బ తీయొచ్చన్న ఉద్దేశంతోనే పార్టీలోకి ఆహ్వానించి.. ఆ వెంటనే పదవిని కట్టబెట్టేరీతిలో ప్లానింగ్ జరిగినట్లు చెబుతున్నారు. తాజా ఎంపికతో వచ్చే ఎన్నికల్లో కైకలూరు సీటు ఖాయంగా తమదే అన్న భావనతోనే ఇదంతా జరిగి ఉంటుందని అంటున్నారు. మరి.. జగన్ అంచనాలు తప్పుతాయా? నిజమవుతాయా? అన్నది తేలాలంటే మరో ఏడాదికి పైనే ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.