Begin typing your search above and press return to search.

ఆయన రాగానే.. ‘అమ్మ’ డిశ్చార్జ్ చేస్తారట

By:  Tupaki Desk   |   21 Oct 2016 4:25 AM GMT
ఆయన రాగానే.. ‘అమ్మ’ డిశ్చార్జ్ చేస్తారట
X
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది ఎంత ఆసక్తికరమైన ప్రశ్నో.. ‘అమ్మ’కు ఏమైంది? అన్న ప్రశ్న కూడా అంతే. కట్టప్ప ప్రశ్నకు సమాధానం ఎలా దొరకదో.. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన ‘అసలు’ విషయం మాత్రం బయటకు రాని పరిస్థితి. సరిగ్గా నెల కిందట.. సెప్టెంబరు 22వ తేదీ అర్థరాత్రి వేళ హుటాహుటిన అమ్మను చెన్నై అపోలో చేర్పించటం.. ఆమె ఆరోగ్యంపై పలు వదంతులు వినిపించటం.. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా చెప్పటం లాంటివి ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఇంతా చేస్తే.. అమ్మకు ఏమైందంటే జ్వరం.. డీహైడ్రేషన్ అని చెప్పారే కానీ అసలు మాట మాత్రం చెప్పింది లేదు.

అమ్మకు వైద్యం చేయటానికి మొదట అపోలో వైద్యులు.. ఆ తర్వాత లండన్ నుంచిడాక్టర్ రావటం.. ఆపై ఎయిమ్స్ నుంచి వైద్య బృందం వచ్చింది. వీరి వైద్యంతో అమ్మ ఆరోగ్యం కుదుటపడిందన్న సమాచారం బయటకు వచ్చిన వేళ.. అమ్మకు వైద్యం చేయటానికి సింగపూర్ నుంచి మరికొందరు వైద్యులు వచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా అమ్మఆరోగ్యంకుదుటపడిందని.. ఆమె పేపరు చదువుతున్నారని.. తనకు వైద్యం చేస్తున్న వైద్యులతో మాట్లాడుతున్నారని.. ఉడకబెట్టిన యాపిల్ ముక్కలు తింటున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే.

అనధికారికంగా ఇన్ని వార్తలు వచ్చినా.. అమ్మకు ఏమైందన్న అసలు విషయం మాత్రం బయటకు పొక్కలేదు. మరోవైపు అమ్మ కోసం కోట్లాదిమంది ఆసక్తిగా.. అతృతగా ఎదురుచూస్తున్నపరిస్థితి. ఆమెకు ఆరోగ్యం బాగు కావాలంటూ కోట్లాది మంది కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె బాగా కోలుకున్నారని.. ఆమెను డిశ్చార్జ్ చేసే అంశంపై ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మకు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని.. ప్రస్తుతం వెంటిలేటర్లు తొలగించారని.. ఆమె సాధారణంగానే శ్వాస తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. అమ్మను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపే అంశంపై వైద్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దీపావళికి ముందే అమ్మను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అమ్మకు వైద్యం చేస్తున్న లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే నాలుగు రోజుల్లో చెన్నైకి రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే.. అమ్మ డిశ్చార్జ్ మీద నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మరోవైపు.. ఆయన వచ్చిన వెంటనే అమ్మ డిశ్చార్జ్ ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. సో.. డాక్టర్ రిచర్డ్ బీలే చెన్నైకి రావటం.. అమ్మను డిశ్చార్జ్ చేయటం ఉంటుందని చెబుతున్నారు. ఇదే జరిగితే.. తమిళనాడుకు దీపావళి కాస్తంత ముందుగానే వచ్చేస్తుందని చెప్పాలి.