Begin typing your search above and press return to search.

అమ్మ ఆసుప‌త్రి ఫోటోలు తెచ్చేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   4 May 2017 4:51 AM GMT
అమ్మ ఆసుప‌త్రి ఫోటోలు తెచ్చేస్తార‌ట‌!
X
అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న వైనానికి చెక్ పెట్టేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ డిసైడ్ అవుతున్నారా? త‌న‌ను దెబ్బ తీసేందుకు అమ్మ మృతిపై లేనిపోని అనుమానాల్ని మ‌రింత పెంచేలా చేస్తున్న అమ్మ విధేయుడు ప‌న్నీర్ సెల్వాన్ని ఆయ‌న వ‌ర్గాన్ని దెబ్బ తీయ‌టానికి అమ్మ ఫోటోల్ని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే పార్టీ నేత‌ల్లో.. ఒక వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌న్నీరు సెల్వం.. అమ్మ మర‌ణం మీద ప‌లు సందేహాలు వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. అమ్మ మ‌ర‌ణం వెనుక ఎలాంటి మిస్ట‌రీ లేద‌ని.. త‌గిన అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే అపోలో ఆసుప‌త్రిలో అమ్మ చికిత్స ఫోటోల్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లుగా అన్నాడీఎంకే (అమ్మ‌) క‌ర్ణాట‌క శాఖ కార్య‌ద‌ర్శి పుహ‌ళేంది తాజాగా ప్ర‌క‌టించ‌టం సంచ‌లంగా మారింది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత రెండుగా చీలిన అన్నాడీఎంకే పార్టీ నేత‌లు ఒక‌టి కావ‌టంపై జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి రాక‌పోవ‌టం.. రెండు వ‌ర్గాల మ‌ధ్య రాజీ ప్ర‌య‌త్నాలు ముగిసిన‌ట్లుగా చెబుతున్నారు.

అమ్మ మ‌ర‌ణంపై న్యాయ‌విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరుతూ ప‌న్నీర్ వ‌ర్గం డిమాండ్ చేస్తోంది. అదే స‌మ‌యంలో చిన్న‌మ్మ‌ను ఆమె ఫ్యామిలీని పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌న్న ఆలోచ‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చిన ప‌న్నీర్ తీరుపై చిన్న‌మ్మ వ‌ర్గం కారాలు మిరియాలు నూరుతున్న‌ట్లుగా స‌మాచారం. త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని దెబ్బ తీసేలా ప‌న్నీర్ వ్య‌వ‌హ‌రించ‌టంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్ఉల‌గా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో.. ప‌న్నీర్ వ‌ర్గాన్ని క‌ట్ట‌డి చేయ‌టానికి.. ఆయ‌న దూకుడుకు చెక్ చెప్పేలా అమ్మ ఆసుప‌త్రి ఫోటోల్ని విడుద‌ల చేయ‌టం మంచిద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఒక్క‌సారి అమ్మ ఆసుప‌త్రి ఫోటోలు బ‌య‌ట‌కు విడుద‌లైన వెంట‌నే.. ఆమెకు ఎలాంటి వైద్య సాయాన్ని అందించారో ఇట్టే తెలుస్తుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఫోటోలు కానీ విడుద‌లైతే ప‌న్నీర్ చెప్పే మాట‌ల్లో నిజం పాళ్లు ఎంత ఉన్నాయ‌న్న విష‌యం కూడా తెలిసిపోతుంద‌న్న మాట వినిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన పుహ‌ళేంది.. త‌గిన అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే అమ్మ ఆసుప‌త్రి ఫోటోలు బ‌య‌ట‌కు వెల్ల‌డిస్తామ‌ని చెబుతున్నారు. దిన‌క‌ర‌న్ పై బూట‌కపు కేసుల్ని బ‌నాయించింద‌న్న ఆరోప‌ణ‌లు చేసిన పుహ‌ళేంది.. అమ్మ‌కుచికిత్స చేసిన స‌మ‌యంలో ప‌న్నీర్ అక్క‌డే ఉన్న విష‌యం కూడా తెలుస్తుంద‌ని చెబుతున్నారు. అమ్మ మ‌ర‌ణంతో త‌ల్లిని కోల్పోయిన పార్టీకి అన్నీ తానై నిలిచిన శ‌శిక‌ళ పార్టీనీ.. ప్ర‌భుత్వాన్ని కాపాడార‌న్నారు. శ‌శిక‌ళ లేకుంటే ఎడ‌పాడి ప్ర‌భుత్వం విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గేదా? అని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం మాట్లాడుతూ.. అమ్మ మ‌ర‌ణంలో అనేక సందేహాలు ఉన్నాయ‌ని.. వాటిని నివృతి చేసుకునేందుకు సీబీఐ విచార‌ణ‌ను తాను డిమాండ్ చేస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ముర‌గా.. అమ్మ‌కు నిజంగా ఏమైంది? నిజం చెప్పే వారెవ‌రు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/