Begin typing your search above and press return to search.

‘అమ్మ’కు అపర భరతుడీ పన్నీరు సెల్వం

By:  Tupaki Desk   |   19 Oct 2016 5:59 PM GMT
‘అమ్మ’కు అపర భరతుడీ పన్నీరు సెల్వం
X
రాజకీయాల్లో విధేయత మామూలే. కానీ.. తమిళనాడులో తంబీలు ప్రదర్శించే విధేయత పాళ్లు మోతాదు మించినట్లుగా కనిపిస్తాయి. పురాణాల్లో చదివినట్లుగా తన అన్న పాదుకల్ని భరతుడు సింహాసనం మీద పెట్టి రాజ్యపాలన చేసిన తీరులోనే తాజాగా అమ్మ ఫోటోతో పాలన చేస్తున్నారు తమిళనాడు అధికారపక్ష నేతలు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి దాదాపు నాలుగు వారాలకు దగ్గరవుతున్న వేళ.. కుంటుపడిన పాలనా రథాన్ని నడిపించేందుకు వీలుగా తాజాగా తమిళనాడు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు.

అమ్మ అందుబాటులో లేనప్పుడు.. జైలు లాంటి వాటిల్లో ఉండాల్సి వచ్చిన సమయంలో అమ్మ తరఫు.. ఆమెకు అత్యంత నమ్మకస్తుడు.. విధేయుడైన పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించటం తెలిసిందే. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రి మంచానికే పరిమితమైన వేళ.. నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో అమ్మ పట్ల తమకున్న విదేయతను చాటుకునేలా అమ్మ కుర్చీని ఖాళీగా ఉంచి.. అమ్మ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న పన్నీరు సెల్వరం తాను కూర్చుకున్న కుర్చీ ముందున్న టేబుల్ మీద అమ్మ ఫోటో పెట్టి క్యాబినెట్ మీటింగ్నిర్వహించారు.

ఆసుపత్రిలో అమ్మ చేరిన తర్వాత తొలిసారి నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో అమ్మ ఫోటోతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సుదీర్ఘ కాలం చికిత్స చేసుకునే అవకాశం ఉండటం.. అధికారిక విధుల్ని చేపట్టానికి మరింత కాలం పట్టే అవకాశం ఉండటంతో.. అమ్మ బాధ్యతల్ని (ఆమె నిర్వర్తిస్తున్నకీలక శాఖల్ని) పన్నీరు సెల్వానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో కావేరీ జలాల మీద సుప్రీంకోర్టు తీర్పు.. దానిపై కర్ణాటక ప్రభుత్వ స్పందనపై చర్చ జరిగింది. క్యాబినెట్ సమావేశం సందర్భంగా అమ్మ పట్ల అపర భరతుడికి ఎంత అభిమానం ఉందన్న విషయం మరోసారి స్పష్టమైందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/