Begin typing your search above and press return to search.

అమ్మకు ప్రాణాపాయం తప్పిందట

By:  Tupaki Desk   |   5 Dec 2016 7:09 AM GMT
అమ్మకు ప్రాణాపాయం తప్పిందట
X
అమ్మకు ఏమైందన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. రెండున్నర నెలలకిందట ఆమె ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదన్న విషయంపై భారీగా ప్రచారం సాగింది. ఒక దశలో ఆమె మరణించినట్లుగా కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అనంతరం వారిని అదుపులోకితీసుకోవటం వేరే అంశంగా చెప్పాలి. అప్పట్లో ఆమె ఆరోగ్యం క్షీణించిందన్న మాట వచ్చినప్పటికీ.. వైద్యులు మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితిపై నమ్మకంగా మాట్లాడటం కనిపించింది.

కానీ.. తాజా పరిణామంలో మాత్రం.. మేం ప్రార్థిస్తున్నాం.. మీరంతా కూడా ఆమె ఆరోగ్యం మెరుగు కావాలని ప్రార్థించండి అంటూ అపోలో ఆసుపత్రే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయటంతో జయలలిత ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆసుపత్రి దగ్గర భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మొహరించటం..పోలీసులకు సెలవులు క్యాన్సిల్ చేయటం.. పారా మిలటరీ దళాల్ని తమిళనాడులోని అన్ని ముఖ్య నగరాలకు పంపటం.. స్కూళ్లకు సెలవు ప్రకటించటం.. పెట్రోల్ బంకులు బంద్ చేయటం లాంటి వాటితో.. ఏదో జరగరానిది జరిగిపోతుందా? అన్న భావన వ్యక్తమయ్యేలా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వీటితో పాటు.. రాత్రి వేళ.. మహారాష్ట్ర నుంచి తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన చెన్నైకి చేరుకోవటం.. డీజీపీతో సమావేశం కావటం లాంటివి.. ఎన్నోసందేహాలకు కారణంగా నిలిచాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కీలకమైన ప్రకటన ఒకటి చేశారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని.. అయితే.. ఐసీయూ సేవలు అవసరమని ఆయన చెప్పటం గమనార్హం.

అమ్మకు ఏదేదో అయిపోతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యాపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా కేంద్ర ఆరోగ్య మంత్రి ఆమెకు ప్రాణాపాయం తప్పిందని.. ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందాన్ని చెన్నైకి పంపినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంపై తాము ఆందోళన చెందుతున్నామని.. ఆమె చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాణాపాయం తప్పిందని చెప్పిన నడ్డా.. ఎయిమ్స్ వైద్యులు చెన్నైకి వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంతకీ అమ్మ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నట్లు? మరికాస్త స్పష్టతతో నడ్డా ప్రకటన చేసి ఉంటే బాగుండేదేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/