Begin typing your search above and press return to search.

కరుణా నిధీ... దమ్ముంటే అసెంబ్లీకి రా

By:  Tupaki Desk   |   23 Aug 2016 7:08 AM GMT
కరుణా నిధీ... దమ్ముంటే అసెంబ్లీకి రా
X
తమిళనాడులో రాజకీయాల్లో ఒకరినొకరు దెబ్బతీసుకోవడం.. అవమానించడం అన్నది చాలా కామన్. కానీ.. కొద్దికాలంగా అక్కడి రాజకీయాలు కొంత స్తబ్దుగానే ఉన్నాయి. అలా సైలెంటుగా ఉన్న తమిళ రాజకీయాలు మళ్లీ సోమవారం నుంచి రసవత్తరంగా మారిపోయాయి. తమిళనాడు సీఎం - అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై విపక్ష డీఎంకే నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యాలతో మళ్లీ అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఆగ్రహించిన జయ.. తన ప్రత్యర్థి - డీఎంకే అధినేత కరుణానిధిని శాసనసభ సాక్షిగా బహిరంగంగా సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి రా.. అంటూ కరుణానిధికి హెచ్చరికలు జారీచేశారు.

కాగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 79 మంది డిఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయించిన జయలలిత... నిన్నటి సమావేశాల్లో ఆగ్రహంతో ఊగిపోయారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఆమె డీఎంకే అధినేత - మాజీ సీఎం కరుణానిధికి సవాల్ విసిరారు. తాను విపక్షంలో ఉండగా... తన పార్టీ సభ్యులంతా సస్పెండైన సమయంలో తానొక్కదాన్నే సభకు వచ్చి మాట్లాడానని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం డీఎంకే సభ్యుల్లో మెజారిటీ మంది సస్పెండ్ అయినా... కరుణ సహా కొంతమంది సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకున్నారు. సభ నుంచి సస్పెండ్ కాని కరుణానిధి కీలక అంశాలు చర్చకు వచ్చినప్పుడు అసెంబ్లీకి రాకపోతే ఎలాగంటూ జయలలిత చేసిన వ్యాఖ్యలు డీఎంకేను డైలమాలో పడేశాయి.

అయితే... వృద్ధాప్యం కారణంగా సభకు కరుణ రావడం లేదు. పైగా సభకు వస్తే జయ తనపై ప్రతీకారం తీర్చుకుంటుందేమో అన్న భయం కూడా ఆయనలో ఉందని చెబుతారు. మొత్తానికి జయపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నిద్రపోతున్న సింహాన్ని లేపడమేనని.. మంచి స్వింగులో ఉన్న జయను ఎదుర్కోవడం ఇప్పుడు డీఎంకేకు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జయ సవాల్ కు కరుణ స్పందన ఎలా ఉంటుందా అన్న ఆసక్తి తమిళ రాజకీవర్గాల్లో ఏర్పడింది.