Begin typing your search above and press return to search.

అమ్మను అర్థం చేసుకున్న 'అమ్మ'

By:  Tupaki Desk   |   4 Aug 2015 10:08 AM GMT
అమ్మను అర్థం చేసుకున్న అమ్మ
X
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 'అమ్మ'లు మెచ్చిన అమ్మగా మారారు. తమిళనాట అందరూ అమ్మా అని గౌరవం, ఆప్యాయతతో పిలిచే జయలలిత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సౌకర్యాన్ని ప్రవేశపెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రయాణాల సమయంలో తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదులను కట్టించారు.

ఈ నెల 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేక సదుపాయాలను ప్రారంభించారు. బస్‌ స్టాండ్‌ లు, తదితర పబ్లిక్‌ ప్రాంతాల్లో తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వడానికి 352 ప్రత్యేక గదులను ప్రారంభించారు. తమ పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఈ గదులను ఏర్పాటు చేశారు. అదే విధంగా తల్లిపాల బ్యాంకులను కూడా ఆరంభించారు. మధురై, తిరుచిరాపల్లి, తదితర ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ బ్యాంకులను ఏర్పాటు చేశారు.

ఈ పాలిచ్చే గదుల్లో టేబుళ్లు, బెంచీలు తప్పనిసరిగ ఉండాలని అమ్మ ఆదేశించారు. కాగా తల్లిపాల నిధులకు ఒక్కో దానికి రూ.10 లక్షల పరికరాలు మంజూరు చేశారు. తల్లులు పాలను దానమిస్తే వాటిని వివిధ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. అవి మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి. తల్లి పాలు చాలని పిల్లలకు వీటిని ఇస్తారు. మొత్తానికి అమ్మ జయలలిత అమ్మ అన్న మాటకు అర్థమై నిలిచారు.