Begin typing your search above and press return to search.

అమ్మ మృతి కేసు...కీల‌క మ‌లుపు!

By:  Tupaki Desk   |   31 July 2018 2:17 PM GMT
అమ్మ మృతి కేసు...కీల‌క మ‌లుపు!
X
త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిపై గ‌తంలో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు అనేక అనుమానాలు లేవనెత్తిన సంగ‌తి తెలిసిందే. అమ్మ మ‌ర‌ణం వెనుక‌ మ‌న్నార్ గుడి మాఫియా ఉంద‌ని త‌మిళ ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. దానికి తోడు శ‌శిక‌ళ వ‌ర్గంపై అన్నాడీఎంకే కీలక నేత దిండిగల్‌ శ్రీనివాసన్ గ‌తంలో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అమ్మ‌కు చికిత్స జ‌రుగుతున్న ఆమె ఉన్న అంత‌స్తులోకి గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు సహా అమిత్‌ షా - రాహుల్‌ గాంధీ - అరుణ జైట్లీల‌ను కూడా అమ్మ‌ను చూడనివ్వకుండా శశికళ అడ్డుకున్నారని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ్మ మృతి వెనుక ముమ్మాటికీ శశికళ - దినకరన్‌ హస్తం ఉంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌నివాస‌న్ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా...తాజాగా ఓ షాకింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. జయ చికిత్స పొందుతున్నప్పుడు ఆమె జ్యూస్ తాగుతున్న‌ట్లు శశికళ విడుద‌ల చేసిన ఓ వీడియో ఫేక్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

చికిత్స స‌మ‌యంలో జ‌య‌ల‌లిత బ్ర‌తికే ఉన్నార‌ని, చివ‌రి 3 రోజుల్లో ఆరోగ్యం క్షీణించిందని....శ‌శిక‌ళ ప్ర‌చారం చేశారు. దానికి అనుగుణంగానే అమ్మ ఆసుప‌త్రి బెడ్ పై జ్యూస్ తాగుతూ...టీవీ చూస్తున్న‌ట్లుగా ఉన్న ఓ వీడియో అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. అయితే, అమ్మ మృతి కేసు విచార‌ణ లో భాగంగా....ఏర్పాటు చేసిన రిటైర్డ్ జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ కు కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. అపోలో ఆసుపత్రిని కమిషన్ కార్యదర్శి కోమల ఆదివారం సందర్శించారు. జయ చికిత్స పొందిన ఐసీయూలోకి వెళ్లిన ఆమెకు విస్తుపోయే విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ఆ గ‌దిలో జయ పడుకున్న మంచానికి ఎదురుగా డోర్ ఉంద‌ని - అక్క‌డ టీవీ లేద‌ని ....కాబ‌ట్టి జ‌య టీవీ చూస్తోన్న వీడియో న‌కిలీద‌ని ఆమె తేల్చారు. అస‌లు ఆ గోడకు టీవీ అమర్చే అవకాశమే లేదని కూడా ఆమె గుర్తించారు. దీంతో ఆ వీడియో నకిలీదని కోమల తేల్చేశారు. పలు కోణాల్లో నిర్వహించిన దర్యాప్తులోనూ ఆ వీడియో నకిలీదని స్ప‌ష్ట‌మైంద‌న్నారు. ఆ ఫేక్ వీడియో గుట్టుర‌ట్ట‌యిన నేప‌థ్యంలో....విచార‌ణ కీల‌క మ‌లుపు తిరిగింద‌ని భావిస్తున్నారు.