Begin typing your search above and press return to search.

జీవం లేని జ‌య ముందు పాడు పాలిటిక్స్‌?

By:  Tupaki Desk   |   6 Dec 2016 6:07 PM GMT
జీవం లేని జ‌య ముందు పాడు పాలిటిక్స్‌?
X
శ‌వ రాజ‌కీయాలు కొత్తేం కాదు. అయితే.. తాజా ఎపిసోడ్‌లో ఒక‌రి కంటే మ‌రొక‌ర‌న్న రీతిలో పోటాపోటీగా జ‌రిపిన శ‌వ‌రాజ‌కీయం చిరాకు పుట్టించ‌ట‌మే కాదు.. రోత పుట్టించేలా చేసింది. రెండు జాతీయ పార్టీలు మ‌ధ్య సాగిన పోటాపోటీ ప‌రామ‌ర్శ‌లో కొంత‌లో కొంత ఊర‌డించే అంశం ఏమైనా ఉందంటే.. ఎవ‌రికి వారు.. త‌మ‌కున్న తెలివికి త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. దేశంలో ఇన్ని రాష్ట్రాలు.. ఎంతోమంది ముఖ్య‌మంత్రులు ఉన్నా.. వారెవ‌రూ అమ్మ‌ను క‌డ‌సారి చూడాల‌న్న అత్రుత‌ను అంత‌గా ప్ర‌ద‌ర్శించ‌లేదు.

ముందుగా అనుకున్న దాని కంటే ఒక రోజు కంటే ఎక్కువ స‌మ‌యాన్ని అంతిమ సంస్కారాల కోసం కుదించిన‌ప్ప‌టికీ.. రెండు జాతీయ పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లంతా పోటాపోటీగా అమ్మ అంతిమ‌యాత్ర‌కు హాజ‌రు కావ‌టం క‌నిపించింది. అన్నింటికి మించి ఆస‌క్తిక‌ర‌మైన వ్య‌వ‌హారం.. రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ద‌ని చెప్పాలి. సాంకేతిక లోపంతో చెన్నైకి వ‌చ్చి మ‌రీ.. ల్యాండ్ కాకుండా ఢిల్లీకి వెళ్లిపోయిన ఆయ‌న‌.. మ‌ళ్లీ వెంట‌నే మ‌రో విమానంలో బ‌య‌లుదేరి చెన్నైకి వ‌చ్చేసి.. అమ్మ‌కు నివాళి అర్పించిన వైనం ప‌లువురిలో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

ప‌క్క‌నున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రు అమ్మ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కాకున్నా.. జాతీయ‌స్థాయిలో కీల‌క‌మైన నేత‌లు మాత్రం చెన్నైకి రావ‌టం చూస్తే.. అదంతా అమ్మ మీద ఉన్న అభిమానంగా సామాన్య జ‌నాలు ఫీల‌య్యే అవ‌కాశం చాలా ఎక్కువ‌.

కానీ.. దాని వెనుక పాడు పాలిటిక్స్ లాంటివి ఉన్నాయ‌న్న విష‌యం.. జ‌య ఆత్మ‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. ప్రాంతీయ పార్టీల‌కు త‌ప్పించి.. జాతీయ పార్టీల ఊసే ఎత్త‌ని త‌మిళ నేల మీద‌.. అమ్మ మ‌ర‌ణం కొత్త ఆశ‌ల్ని చిగురించేలా చేశాయ‌ని చెప్పాలి. దీనికి తోడు.. విప‌క్షానికి చెందిన డీఎంకే అధినేత క‌రుణ సైతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వేళ‌.. ద్ర‌విడ పార్టీల‌కు అండాదండా అందించేందుకుతాము సిద్ధ‌మంటే.. తాము సిద్ధ‌మ‌న్న సిగ్న‌ల్స్ అందించేందుకు కాంగ్రెస్‌.. బీజేపీలు పోటీ ప‌డ్డాయ‌ని చెప్పక త‌ప్ప‌దు.

అమ్మ మీద గౌర‌వం కంటే.. రాజ‌కీయ చ‌ద‌రంగంలో త‌మ‌దైన పావులు క‌దిపేందుకు వ‌చ్చిన అవ‌కాశాన్ని అధికార బీజేపీ.. విప‌క్ష కాంగ్రెస్ వ‌దులుకోలేద‌ని చెప్పాలి. అందుకే.. అంత పెద్ద మోడీ దిగి రాక త‌ప్ప‌లేదు. వ‌స్తూ.. వ‌స్తూ త‌న ప‌రివారాన్ని తీసుకొచ్చిన ఆయ‌న‌.. ఎప్పుడూ లేని విధంగా వ్య‌వ‌హ‌రించారని చెప్ప‌క త‌ప్ప‌దు. అమ్మ భౌతిక‌కాయంముందు శిర‌స్సు వంచిన ఆయ‌న‌.. ఆ ప‌క్క‌కు వ‌చ్చి.. ఒక చేత్తో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌న్నీరు సెల్వంకు ప‌రామ‌ర్శ హ‌గ్గు ఇచ్చి.. మ‌రోవైపు అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ నెత్తి మీద చెయ్యి వేసి.. ఆపై భుజం మీద అనునయిస్తున్న వైనం చూసిన‌ప్పుడు.. ఆయ‌న వ‌చ్చింది ఎందుక‌న్న విష‌యం.. మిగిలిన వారి కంటే ఎక్కువ‌గా జీవం లేని జ‌య‌ల‌లిత ఆత్మ‌కు బాగానే తెలుసు.

మోడీ లాంటి నేత అమ్మ అంత్య‌క్రియ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు.. కాంగ్రెస్ యువ‌రాజు త‌న ప‌టాలంతో రాకుండా ఉంటారా? అందుకే అంత్య‌క్రియ‌ల‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అంతిమ సంస్కారాలు పూర్తి అయ్యే వ‌ర‌కూ ఉండిపోయారు. అన్నింటికి మించి అత‌గాడిలో అమ్మ పోయిన తాలూకూ సీరియ‌స్ నెస్ ఎంత‌న్న‌ది.. టీవీ లైవ్ లో క‌నిపించిన ఒకే ఒక్క సీన్ తో అర్థం చేసుకోవ‌చ్చు. కోట్లాది మంది గుండెలు అవిసేలా రోదిస్తున్న వేళ‌.. అమ్మ భౌతిక‌కాయానికి కూత‌వేటు దూరంలో ఉన్న రాహుల్‌.. త‌న స‌హ‌చ‌రుల‌తో న‌వ్వుతూ క‌నిపించిన వైనం చూస్తే.. ఆయ‌న ప‌రామ‌ర్శ‌లో అస‌లు రంగు ఇట్టే తెలిసే ప‌రిస్థితి. రెండు జాతీయ పార్టీలు.. త‌మిళ‌నాడు అధికార‌ప‌క్షంలో నెల‌కొన్న రాజ‌కీయ శూన్య‌త‌ను త‌మ‌కు అవ‌కాశంగా మార్చుకునేందుకు ల‌భించిన అవ‌కాశాన్ని ఏమాత్రం వ‌దులుకోలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వీట‌న్నింటిని చూస్తున్న జ‌య ఆత్మ (?) ఏమ‌ని అనుకొని ఉంటుందో..?