Begin typing your search above and press return to search.

వ‌ర‌దలో చిక్కుకుపోయిన సీఎం కాన్వాయ్‌

By:  Tupaki Desk   |   16 Nov 2015 4:23 PM GMT
వ‌ర‌దలో చిక్కుకుపోయిన సీఎం కాన్వాయ్‌
X
చెన్నై నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులు సైతం నదులను తలపించాయి. ఈ క్ర‌మంలో చెన్నైలో వర్ష ప్రభావిత ప్రాంతాలలో సీఎం జ‌య‌ల‌లిత‌ పర్యటించారు. వర్షాలతో అతలకుతలమైన తన నియోజకవర్గం డాక్టర్ రాధాకృష్ణ నగర్‌ లో పర్యటించేందుకు వెళ్లే సమయంలో జ‌య‌ల‌లిత‌ కాన్వాయ్ ట్రాఫిక్‌ జామ్‌ లో ఇరుక్కుపోయింది. దాదాపు అరగంట‌పాటు శ్ర‌మించిన పోలీసులు అష్ట‌క‌ష్టాలు ప‌డి కాన్వాయ్‌ కు దారి ఇవ్వ‌గ‌లిగారు. ఇదిలాఉండ‌గా...మెట్రో ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ కు చెందిన ఒక బస్సు అరంగనాథన్ సబ్ వే రోడ్డులో పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయింది.

ఈ సంద‌ర్భంగా బాధితులను ఓదార్చి త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను జ‌య‌ల‌లిత వివ‌రించారు. వర్ష ప్రభావిత జిల్లాలలో సహాయ పునరావాస కార్యక్రమాల కోసం సీఎం జయలలిత రూ.500 కోట్లు ప్రకటించారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె వారికి వివరించారు. అంతకు ముందు మంత్రుల, సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జయలలిత వర్ష ప్రభావిత జిల్లాలలో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను సమీక్షించారు.

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులో మృతుల సంఖ్య 71కి పెరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు దాదాపుగా మూతపడ్డాయి. చెన్నై నుంచి బయలుదేరే పలు రైళ్లను దారి మళ్లించారు. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ - ఎగ్మోర్‌ గౌహతి ఎక్స్‌ ప్రెస్‌ తదితర రైళ్లను గుత్తి మీదుగా దారి మళ్లించారు.