Begin typing your search above and press return to search.

చెన్నారెడ్డితో యుద్ధం.. రోశయ్యతో స్నేహం

By:  Tupaki Desk   |   6 Dec 2016 9:25 AM GMT
చెన్నారెడ్డితో యుద్ధం.. రోశయ్యతో స్నేహం
X
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లో మూడు పర్యాయాలు తెలుగువారే గవర్నర్లుగా ఉన్నారు. తాజాగా జయ మృతి సమయంలోనే తెలుగువారైన విద్యాసాగరరావు గవర్నరుగా వున్నారు. అంతేకాదు... 1990వ దశకంలో మర్రి చెన్నారెడ్డి నుంచి ఇటీవలి రోశయ్య - ఆపై విద్యాసాగర్ రావులు తమిళనాడుకు గవర్నర్ గా ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. జయలలితను అదుపులో ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ 1990లో మర్రి చెన్నారెడ్డిని తమిళనాడు గవర్నరుగా పంపించింది... కానీ, చెన్నారెడ్డి పప్పులు జయ ముందు ఉడకలేదు.

చెన్నారెడ్డి తమిళనాడు గవర్నరుగా ఉన్న సమయంలో పాలనలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. జయలలితను అణగదొక్కాలని చెన్నారెడ్డి, ఆయన అధికారాన్ని పరిమితం చేయాలని జయలలిత నిత్యం ప్రయత్నించేవారు. అందులో జయదే పైచేయి అయ్యేది. తరువాత కాలంలో జయలలితను మంచి చేసుకునేందుకు రోశయ్యను గవర్నర్ గా పంపింది కేంద్రం. ఏపీ సీఎంగా రాజీనామా చేసిన రోశయ్యను తమిళనాడు గవర్నర్ గా నాటి యూపీఏ ప్రభుత్వం ఎంపిక చేయగా, జయలలిత - రోశయ్యల నడుమ మంచి సంబంధాలే ఉండేవి. అందుకే రోశయ్య పదవీకాలం పొడిగించాలని కూడా జయ కేంద్రాన్ని కోరారు. ఒకవేళ కుదరని పక్షంతో రోశయ్యలాంటి గవర్నరు కావాలని కూడా ఆమె కేంద్రానికి కోరినట్లు చెబుతారు. జయలలిత పట్ల మంచి అభిప్రాయమే ఉన్న మోడీ కూడా ఆమె కోరుకున్నట్లుగానే క్లీన్ పొలిటీషియన్, మంచి వ్యక్తిగా పేరున్న మహారాష్ర్ట గవర్నరు విద్యాసాగరరావుకు తమిళనాడు బాధ్యతలు అప్పగించారు. అనారోగ్యం కారణంగా జయ, ఆయన కలిసి పనిచేయడం లేకపోయినా ఆమె ఆసుపత్రిలో ఉన్న సమయంలో... ఇప్పుడు ఆమె మరణం సమయంలో రాజకీయ పరిస్థితులు అదుపులో ఉంచుతూ విద్యాసాగరరావు సమర్థంగా డీల్ చేశారు.

చెన్నారెడ్డి గవర్నరుగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది కానీ... రోశయ్య విషయానికొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారింది. జయ - రోశయ్యలు స్నేహితుల్లా మెలిగారు. రోశయ్య గవర్నర్ గా ఉన్న సమయంలోనే జయలలిత పాత రికార్డులు బద్దలు కొడుతూ, వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు.

ఇప్పుడు ఆమె మరణం వేళ కూడా గవర్నర్ గా ఉన్న తెలుగు వ్యక్తి విద్యాసాగర్ రావు ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షిస్తూ - ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చిస్తూ, పాలన గాడితప్పకుండా చూశారు .

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/