Begin typing your search above and press return to search.

కారుచౌక; ‘అమ్మ’ కందిపప్పు కిలో రూ.110

By:  Tupaki Desk   |   20 Oct 2015 9:12 AM GMT
కారుచౌక; ‘అమ్మ’ కందిపప్పు కిలో రూ.110
X
తనను అభిమానంతో పిలిచే పేరును బ్రాండ్ గా మార్చి.. దాంతో కోట్లాది మంది మనసుల్ని దోచుకోవటం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మాత్రమే సాధ్యమవుతుందేమో. అమ్మ పేరు మీద హోటళ్లు దగ్గర నుంచి మంచినీరు.. ఉప్పు.. సిమెంటు.. మందులషాపు.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని అమ్మ బ్రాండ్ లో బంధించేసి.. తక్కువ ధరకే సామాన్యులకు వస్తువులు అందేలా చేయటంలో జయలలిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

వరుసగా అధికారాన్ని చేపట్టే అవకాశం లేని తమిళనాడులో.. ఈసారి ఆ పరిస్థితిని మార్చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా గత నాలుగేళ్లుగా ఆమె ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ తమిళుల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ అంశానికైనా సరే.. వెనువెంటనే స్పందించి వారికి ఇబ్బంది లేకుండా చేయటంలో జయలలిత అపరిమితమైన వేగంగా నిర్ణయాలు తీసేసుకుంటారు.

తాజాగా మండిపోతున్న కందిపప్పు ధరలతో తమిళులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాంబార్ లేకుండా ముద్ద దిగని తమిళులకు.. ఆకాశాన్ని అంటే కందిపప్పు ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అందుకు పరిష్కారం ఆమె కనుగొన్నారు. బహిరంగ మార్కెట్ లో కిలో కందిపప్పు రూ.200 నుంచి రూ.225మధ్య పలుకుతున్న నేపథ్యంలో అదే కిలో కందిపప్పును సగం ధరకు అంటే.. కేజీ రూ.110 లభ్యమయ్యేలా అమ్మ కందిపప్పును మార్కెట్లోకి తీసుకొచ్చేశారు.

విదేశాల నుంచి కేంద్ర సర్కారు భారీగా కందిపప్పును తీసుకురావటం తెలిసిందే. 7వేల టన్నుల కందిపప్పును కేంద్రం తీసుకొచ్చి.. ఎలాంటి భారం పడకుండా రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉండగా..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో వెయ్యి టన్నుల కందిపప్పును రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక.. అమ్మ కూడా స్పందించి కేంద్రంతో మాట్లాడుకొని 500 టన్నుల కందిపప్పును తమిళనాడుకు పంపేలా ఒప్పించుకున్నారు.

కేంద్రం నుంచి వచ్చే కందిపప్పును.. కిలో.. అరకిలోలుగా ప్యాకెట్లు చేయించి రూ.110.. రూ.55గా నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రత్యేక దుకాణాల ద్వారా వాటిని విక్రయించాలని నిర్ణయించారు. దీంతో మండిపోతున్న కందిపప్పు స్థానే అమ్మ బ్రాండ్ మీద వచ్చే కందిపప్పు కారుచౌకగా లభించే అవకాశం ఉంది. కిలోకి రూ.100 మేర ఆదా అవుతుంటే. ఎవరు మాత్రం అమ్మను అభినందించరు చెప్పండి. అమ్మను చూసి.. చంద్రుళ్లు ఇద్దరూ ఇలాంటి విధానాన్ని అనుసరిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ధరా భారం నుంచి కాస్తంత సాంత్వన లభించే వీలుంది.