Begin typing your search above and press return to search.

అమ్మ కేబినెట్లో తెలుగోడు

By:  Tupaki Desk   |   23 May 2016 1:25 PM IST
అమ్మ కేబినెట్లో తెలుగోడు
X
తమిళనాడు అంటేనే ప్రాంతీయ భాషాభిమానం ఫుల్లుగా ఉన్న రాష్ట్రం. తమిళ ప్రజలు ఎక్కడికెళ్లినా తమ మాతృభాషను మరువరు. తమిళానికి ప్రాధాన్యమిస్తూ అక్కడ తెలుగుకు సమాధి కట్టే ప్రయత్నం కూడా జరిగింది.. అక్కడ స్వీయ భాషాభిమానం ఆ స్థాయిలో ఉంటుంది. అలాంటి తమిళనాడులో ఇప్పుడు జయలలిత ప్రభుత్వంలో తెలుగు నేత ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. అనూహ్య పరిస్థితుల్లో రెండో సారి అధికారంలోకి వచ్చిన జయ తన కేబినెట్లో తెలుగు నేతకు స్థానం ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో అన్నాడీఎంకే టికెట్ పై బరిలోకి దిగిన నేత రాజు విజయం సాధించి తమిళనాడు అసెంబ్లీలో ఆయన కాలుమోపారు.

కాగా జయలలిత తన కేబినెట్ ను కొలువుదీర్చారు. 28 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో రాజుకు కూడా స్థానం కల్పించారు. ఆయనకు ఐటీ శాఖను కేటాయించినట్లు చెబుతున్నారు. అయితే.. జయలలిత సింగిల్ గానే ప్రమాణం చేయగా మంత్రులంతా మాత్రం సామూహికంగా ఒకేసారి ప్రమాణస్వీకారం చేశారు. మద్రాస్ వర్సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జయ ప్రమాణం తర్వాత మంత్రులంతా వరుసగా నిలబడి... వరుసగా తమ పేర్లు చెప్పుకుని... ఆ తర్వాత అంతా కలిసి ఒకేసారి ప్రమాణం చేశారు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల మధ్య జయలలిత తన మతృభాష తమిళంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసేందుకు జయలలిత లేచిన సందర్భంగా, ప్రమాణ స్వీకారం ప్రారంభ సమయంలోనూ జయ అభిమానులు వేసిన ఈలలు - కేకలతో వర్సిటీ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. కాగా తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు నేతకు స్థానం దక్కడంపై అక్కడి తెలుగు సమూహాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.